విండీస్‌తో తొలి టెస్ట్‌లో కోహ్లీసేన శాసించే స్థితి వైపు పరుగులు పెడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 75 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి కోహ్లీసేన 72 ఓవర్లకు 185/3 వద్ద నిలిచింది. కోహ్లి, రహానె అర్ధశతకాలతో క్రీజులో ఉన్నారు.
మయాంక్ మళ్లీ..
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (16) రెండో ఇన్నింగ్‌లోనూ తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన అతను చేజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (38; 85 బంతుల్లో 4×4), పుజారా (25; 53 బంతుల్లో 1×4)తో కలిసి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. విండీస్ బౌలర్లను వీరు ధాటిగా ఎదుర్కొన్నారు. కానీ ఈ జోడీని చేజ్ విడదీశాడు. 30వ ఓవర్‌లో చక్కటి బంతితో రాహుల్‌ను బౌల్డ్ చేశాడు. కాసేపటికే పుజారాను రోచ్ బోల్తా కొట్టించాడు. అప్పటికి స్కోరు 81/3.
శతక భాగస్వామ్యం..
మూడో రోజు ఆటలో కోహ్లీ- రహానె జోడీ ప్రదర్శన ఆకట్టుకుంది. స్వల్ప పరుగుల వ్యవధిలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన భారత్ ఇన్నింగ్‌ను వీరిద్దరూ చక్కదిద్దారు. విండీస్ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంటూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగారు. 68వ ఓవర్‌లో రహానె అర్ధశతకం అందుకోగా.. 71వ ఓవర్‌లో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శతక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో రోజు ఆటలో అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో రోచ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకే ఆలౌట్ అయింది. ఇషాంత్ శర్మ 5 వికెట్లు తీసి సత్తా చాటాడు.
- ఇదీ చూడండి: బుమ్రా సలహా పనిచేసింది: ఇషాంత్ శర్మ