టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గత దశాబ్ద కాలంలో అత్యంత ప్రభావం చూపిన ఆటగాడని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. గత పదేళ్లలో విరాట్ గెలిచిన మ్యాచ్ల గణాంకాల దృష్ట్యా ఈ వ్యాఖ్య చేశాడు.
"కోహ్లీ సారథ్యంలోనే భారత్ ఎక్కువ మ్యాచ్లు గెలిచింది. అందుకే అతడు అత్యంత ప్రభావం చూపిన ఆటగాడు. కేవలం ఎక్కువ పరుగులు, వికెట్లు తీసిన వారి ఆధారంగా ఈ మాటలు అనడం లేదు. మొత్తం మ్యాచ్ల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి, అత్యంత ప్రభావితం చేసిన ఆటగాడి గురించి మాట్లాడుతున్నాను"
-సునీల్ గావస్కర్, భారత మాజీ ఆటగాడు
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఇందుకు భిన్నంగా స్పందించాడు. వన్డేల్లో ధోనీనే అత్యంత ప్రభావం చూపిన అటగాడని అభిప్రాయపడ్డాడు.
"మహేంద్ర సింగ్ ధోనీ.. భారత్కు వన్డే, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చిపెట్టాడు. నా దృష్టిలో ప్రపంచకప్ సాధించడం ఓ ఘనత. అంతేకాక, మిడిలార్డర్లో ధోనీ మంచి ఆటగాడు"
-హేడెన్, ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మన్
2008లో కెరీర్ ప్రారంభించిన కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ఆటగాడిగా ఎదిగాడు. ఇటీవలే వన్డేల్లో 12,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ సచిన్ రికార్డును అధిగమించాడు.