ఐపీఎల్.. ప్రపంచంలోనే అతిపెద్ద, ధనిక క్రికెట్ లీగ్. అలాంటి మెగా ఈవెంట్‌ను విదేశీ ఆటగాళ్లు లేకుండా నిర్వహించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్వాడియా. కరోనా సమయంలో ఈ లీగ్ నిర్వహణ, రద్దుపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బీసీసీఐ తొందరపడినట్టే అని అన్నారు.
"ఐపీఎల్ అనేది భారత్ తయారుచేసిన ఓ అంతర్జాతీయ టోర్నీ. ప్రపంచంలోనే ప్రీమియర్ క్రికెట్‌ను అందిస్తున్న ఈవెంట్ ఇది. అందుకే ఈ అంతర్జాతీయ వేదికపై అంతర్జాతీయ క్రికెటర్లు ఉండాల్సిందే" అని వాడియా అభిప్రాయపడ్డారు.
భిన్నాభిప్రాయాలు..
ఐపీఎల్ నిర్వహణపై ఆయా ఫ్రాంచైజీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ ఆటగాళ్లకు ప్రయాణాల ఆంక్షల నేపథ్యంలో భారతీయ ఆటగాళ్లతో ఆడించినా సరిపోతుందని రాజస్థాన్ జట్టు ప్రతిపాదించగా.. ఆ నిర్ణయాన్ని చెన్నై సూపర్‌కింగ్స్, పంజాబ్ జట్లు వ్యతిరేకించాయి.
"ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు మనం ఎదురుచూడక తప్పదు. వైరస్ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో చెప్పలేం. ఇప్పటికే జర్మనీ ఫుట్‌బాల్ పోటీలు మొదలుపెట్టాలని చూస్తోంది. మనం కూడా ఐపీఎల్‌ను నిర్వహిస్తే అభిమానులు బాగా ఆదరిస్తారు. కానీ అందుకు కాస్త సమయం పడుతుంది. వచ్చే రెండు నెలల్లో పరిస్థితులను బట్టే టోర్నీ నిర్వహణ ఆధారపడి ఉంటుంది"
-నెస్ వాడియా
ప్రయాణ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనేందుకు ఆటగాళ్లు భారత్‌కు వస్తారో లేదో అనేది కీలకంగా మారింది. బీసీసీఐ చాలా అంశాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని వాడియా చెప్పారు.
జులై-ఆగస్టులో ఈ మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్-డిసెంబర్ మధ్య సమయానుగుణంగా ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్ మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఐపీఎల్‌పై ఆశలు ఇంకా చిగురిస్తున్నాయి.
ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే దాదాపు 4వేల కోట్లపైనే ఆదాయం నష్టపోవాల్సి వస్తుందని అంచనా వేసింది బీసీసీఐ. ఇది టీ20 వరల్డ్‌కప్ నష్టం కంటే చాలా ఎక్కువ.