భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన మాజీ సారథి కపిల్ దేవ్... క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) అధ్యక్ష పదవి నుంచి వైదొలిగాడు. పరిపాలకుల కమిటీ (సీఓఏ)కి తన రాజీనామా లేఖను ఇ-మెయిల్ చేసినట్లు సమాచారం. ఏ కారణంతో తప్పుకున్నాడన్న విషయం ఇంకా అధికారులు వెల్లడించలేదు.
ఇదే కారణమా....!
ఈ ఏడాది జులైలో తాత్కాలిక క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) అధ్యక్షుడిగా కపిల్‌ను నియమించింది బీసీసీఐ పరిపాలకుల కమిటీ. ఇందులో సభ్యులుగా కపిల్‌తో పాటు శాంత రంగస్వామి, అన్షుమాన్ గైక్వాడ్‌లు ఉండేవారు. వీళ్లే పురుషులు, మహిళల జాతీయ జట్ల కోచ్‌ల నియామకాలు చేపట్టి అభ్యర్థులకు ముఖాముఖిలు నిర్వహించారు. ఈ బాధ్యతల్లో ఉండే... ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రికి రెండోసారి పట్టం కట్టారు.
ఈ ముగ్గురూ వేర్వేరు పదవుల్లో ఉంటూ సలహా కమిటీలోనూ సభ్యులుగా ఉండటంపై వారు విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ వారికి నోటీసులు పంపారు. ఇందులో భాగంగానే తొలుత శాంత రంగస్వామి తన పదవి నుంచి వైదొలిగింది. తాజాగా కపిల్ కూడా ఇదే కారణంతో తప్పుకున్నట్లు తెలుస్తోంది.
అయితే... సీఏసీ సభ్యులకు ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలు లేవని పరిపాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ స్పష్టం చేశాడు.
ద్రవిడ్‌కు సెగ..
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండటానికి వీళ్లేదు. ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఎదుట హాజరయ్యాడు. తనపై వచ్చిన విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై వివరణ ఇచ్చాడు. ఇండియా సిమెంట్స్ ఉద్యోగిగా ఉండి... నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించినట్లు గుప్తా ఆరోపించారు.