ఆస్ట్రేలియా జట్టులోని స్టార్ క్రికెటర్ కేన్ రిచర్డ్సన్.. త్వరలో భారత్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. ఇతడి స్థానాన్ని ఆండ్రూ టైతో భర్తీ చేయనుంది ఆస్ట్రేలియా బోర్డు. తన భార్య నైకీ బాబుకు జన్మనివ్వడం వల్ల కేన్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేసింది ఆసీస్ యాజమాన్యం.
"ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కేన్‌కు కాస్త కష్టమైనదే. అందుకే అతడికి సెలక్టర్లు, ఆటగాళ్ల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. తన భార్య నైకీ, బాబుతో కలిసి కేన్ అడిలైడ్‌లో ఉండనున్నాడు. ఆటగాళ్లు, వాళ్ల కుటుంబాలకు మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం. అతడు జట్టు కోసం చాలా చేశాడు. అతడి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం"
-- ఆస్ట్రేలియా బోర్డు
కేన్ రిచర్డ్సన్ స్థానంలో టై జట్టులోకి వస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ టై కనువిందు చేశాడు. ఇప్పటివరకు 7 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. మొత్తం 49 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
ప్రత్యేక విమానంలో సిడ్నీకి
కరోనా కారణంగా.. అడిలైడ్‌లో ఉన్న తమ ఆటగాళ్లను మంగళవారం ప్రత్యేక విమానం ద్వారా సిడ్నీకి తరలించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని, అన్నీ నియంత్రణలోకి వస్తాయని బోర్డుకు చెందిన ఓ అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత సిడ్నీకి చేరుకున్న భారత ఆటగాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటూ సాధన మొదలుపెట్టారు. నవంబర్ 27న ప్రారంభమై జనవరి 27న ముగిసే ఆస్ట్రేలియా పర్యటనలో.. భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.