జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం వన్డేల్లో నెంబర్వన్ బౌలర్. పరిమిత ఓవర్లలోనే కాక టెస్టుల్లోనూ సత్తాచాటుతున్నాడు. కానీ న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో మాత్రం అతడి ప్రదర్శన అస్సలు బాలేదంటున్నారు విశ్లేషకులు. అందుకు కారణం లేకపోలేదు. ఈ సిరీస్లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతడి ప్రదర్శన టీమిండియా ఓటమిపైనా ప్రభావం చూపిందని అంటున్నారు పండితులు.
ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్ను వికెట్ లేకుండా ముగించడం బుమ్రాకు ఇదే తొలిసారి. ఈరోజు జరిగిన చివరి వన్డేలో బుమ్రా 10 ఓవర్లు వేసి వికెట్లు ఏమీ తీయకుండా 50 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే మొదటి, రెండో వన్డేలోనూ వరుసగా 64, 53 పరుగులు ఇచ్చాడు. మొత్తం ఈ సిరీస్లో 30 ఓవర్లు వేసి 167 పరుగులు దారపోశాడు. ఇందులో ఒక మెయిడిన్ మాత్రమే ఉంది.
చివరగా బుమ్రా ఆడిన ఆరు వన్డేల్లో ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో పోల్చుకుంటే టీ20 ప్రదర్శన కాస్త మెరుగ్గా ఉంది. ఈ ఏడాదిలో 7 టీ20లు ఆడి 8 వికెట్లు దక్కించుకున్నాడీ స్పీడ్ స్టార్.