తాను క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా స్పందించాడు ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్. ఇప్పట్లో అలాంటి అలోచన లేదని తేల్చి చెప్పాడు. 2021-22లో జరిగే యాషెస్ సిరీస్ వరకు కచ్చితంగా జట్టులోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు.
"క్రికెట్ ఆడాలనే తపన నాలో ఇంకా ఉంది. ఒక పేలవ ప్రదర్శన తర్వాత ఇలాంటి రూమర్లు రావడం సహజం. ఇలాంటి ప్రచారం మంచిది కాదు. ఏదైనా మ్యాచ్లో మంచి ప్రదర్శన చేయని క్రమంలో నా రిటైర్మెంట్ గురించి రూమర్లు పుట్టుకురావడం నచ్చలేదు. నా కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేశా. కానీ, గతంతో పోలిస్తే ప్రస్తుతం కొంచెం భిన్నంగా సాగుతోంది."
-జేమ్స్ అండర్సన్, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్
తనకు 40 ఏళ్లు వచ్చేంత వరకు క్రికెట్లో కొనసాగుతానని ఈ ఏడాది మార్చిలో వెల్లడించాడు జేమ్స్ అండర్సన్. టెస్టుల్లో 590 వికెట్లు సాధించి.. ఆ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్గా రికార్డు సాధించాడు జేమ్స్ అండర్సన్. 600 వికెట్ల క్లబ్లో చేరడానికి ఇంకా 10 వికెట్ల దూరంలోనే ఉన్నాడు. అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే తర్వాతి స్థానానికి చేరాడు జేమ్స్ అండర్సన్.