మరో రెండు వారాల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లకు కొత్త జెర్సీలు తయారు చేసింది. ఈ మేరకు ఆ జట్టు సారథి మహేంద్రసింగ్ ధోనీ గతరాత్రి నూతన జెర్సీని ఆవిష్కరించాడు. ఆ వీడియోను సీఎస్కే ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే, ఆ జట్టు కీలక ఆల్‌రౌండరైన రవీంద్ర జడేజా ఆ పోస్టును చూసి కొంటెగా స్పందించాడు. తనకు 'ఎల్' సైజ్ జెర్సీ కావాలని కోరుతూ కామెంట్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే, 2008 ప్రారంభ ఐపీఎల్ సీజన్ నుంచి సీఎస్కే తమ జెర్సీని కొత్తగా రూపొందించడం ఇదే తొలిసారి. ఈసారి ఆటగాళ్ల జెర్సీలపై భుజాల వద్ద ఇండియన్ ఆర్మీ దుస్తులు పోలిన రంగుతో తయారు చేశారు. కొద్ది కాలం నుంచే ఈ ఆలోచన తమ మదిలో ఉందని, దేశం కోసం భారత జవాన్లు చేసే త్యాగాలు, వారి ప్రాధాన్యం గుర్తించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామని సీఎస్కే సీఈవో విశ్వనాథన్ పేర్కొన్నారు. వాళ్ల పనికి ఇదో గుర్తింపు అని, వాళ్లే నిజమైన హీరోలని ఆయన మెచ్చుకున్నారు.
కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో గాయపడిన జడేజా క్రమంగా కోలుకుంటున్నాడు. చేతికి వేలికి గాయమవడం వల్ల ఇంగ్లాండ్‌తో అన్ని సిరీస్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే తన గాయంపై సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అభిమానులతో నిత్యం అందుబాటులో ఉన్నాడు. తాజాగా జిమ్‌లో సాధన చేస్తున్న వీడియోను పంచుకొని 'ఇలాగే ముందుకు సాగుతుండు' అని పేర్కొన్నాడు.