ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నమెంట్ ఐపీఎల్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్రమ్.. ఐపీఎల్, పీసీఎల్ల మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్లో వచ్చిన లాభాల్ని ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తిరిగి పెట్టుబడి పెడుతున్నందుకు బీసీసీఐని ప్రశంసించాడు అక్రమ్. ఇటీవలి కాలంలో భారత్ నమ్మకమైన ఆటగాళ్లను సంపాదించిందని పేర్కొన్నాడు.
![Wasim Akram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wasim-akram_3007newsroom_1596117461_517.jpg)
"ఐపీఎల్, పీఎస్ఎల్కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గత ఐదారు సంవత్సరాలుగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లు చాలా పెట్టుబడి పెట్టారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ఐపీఎల్ అతిపెద్ద టోర్నమెంట్. ఆటగాళ్లను కొనేందుకు ఒక జట్టు బడ్జెట్ 60 - 80 కోట్లు. పాకిస్థాన్ కరెన్సీకి ఇది రెట్టింపు. అందుకే ఈ విధంగా వచ్చిన లాభాన్ని.. బీసీసీఐ తిరిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పెట్టుబడి పెడుతోంది.
వసీం అక్రమ్, పాక్ మాజీ కెప్టెన్
ఐపీఎల్లో చాలా మంది ఆటగాళ్లకు ప్రవీణ్ ఆమ్రే వంటి వ్యక్తిగత కోచ్‌లు ఉన్నారని పేర్కొన్నాడు అక్రమ్. భారత బ్యాట్స్‌మన్ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారని.. వారి ఆటతీరు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపాడు.
కరోనా వైరస్ కారణంగా నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్‌ను చివరకు యూఏఈలో నిర్వహించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఈ లీగ్ జరగనుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ఇటీవలే తెలిపారు.