మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ జరిగే విషయమై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అయితే ఐపీఎల్ నిర్వహణ సాధ్యమవుతుందని, కానీ పూర్తి తరహాలో కాకుండా 'మినీ ఐపీఎల్' లాగా నిర్వహించవచ్చని రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని మనోజ్ బదలే అభిప్రాయపడ్డాడు.
"ఈ ఏడాది ప్రత్యేక తరహాలోనైనా ఐపీఎల్ ఉంటుందని ఆశిస్తున్నా. మినీ ఐపీఎల్‌ను నిర్వహించవచ్చు. ప్రజలంతా సృజనాత్మకంగా ఉండటానికి సిద్ధంగా ఉండండి. బోర్డు సభ్యులంతా కలిసి టోర్నీని నిర్వహించడానికి ప్రయత్నించాలి. క్రికెట్‌కు ఈ టోర్నీ ఎంతో ముఖ్యం. ఐపీఎల్ వల్ల ఎంతో మంది దేశీయ ఆటగాళ్లకు లబ్ధి చేకూరుతుంది. అంతేకాక స్టార్ ఆటగాళ్లు, నిర్వాహకులు, బ్రాడ్‌కాస్టర్స్‌కు ఆర్థికంగా దోహదపడుతుంది. ఇది ఎంతో మందికి జీవనోపాధి. టోర్నీని నిర్వహించడం మా బాధ్యత. నిర్వహణ కోసం సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాం" అని మనోజ్ అన్నాడు.
మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. కానీ దేశంలో మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటం వల్ల ఐపీఎల్ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి.
ఇదీ చూడండి.. 'షేన్ వార్న్ అత్యుత్తమ జట్టులో లక్ష్మణ్‌కు దక్కని చోటు'