కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపిస్తే టోర్నీపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అయితే కొవిడ్-19 ముప్పు కాస్త ఎక్కువగానే కనిపిస్తుండటం వల్ల అన్ని ఫ్రాంచైజీలు ఈ సీజన్‌పై ఆశలు వదిలేసుకున్నాయని తెలుస్తోంది. జట్లన్నీ ఈ సారి టోర్నీ ఉండకపోవచ్చని మానసికంగా సంసిద్ధమయ్యాయని సమాచారం. సోమవారం జరిగిన ఫ్రాంచైజీలు, బీసీసీఐ కాన్ఫరెన్స్ కాల్‌లో ఈ విషయంపై చర్చించుకున్నారని వినికిడి.
"సోమవారం సాయంత్రం కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. పరిస్థితుల గురించి చర్చించారు. కానీ ఓసారి మీరు పరిశీలిస్తే పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు, మాల్స్ అన్నీ మూసేశారు. జిమ్‌లు మూసేయాలని ఆదేశాలు వచ్చాయి. బహుశా ఈ సారి లీగ్ రద్దు కావొచ్చనే పరిస్థితులే కనిపిస్తున్నాయి."
- ఓ ఫ్రాంచైజీ అధికారి
"జీతభత్యాల ద్వారా కనీసం రూ.15-20 కోట్లు నష్టం వస్తుంది. మార్చండైజ్ విక్రయాలనూ నష్టపోవాల్సి ఉంటుంది. టికెట్లు సహా చాలా వరకు బీమా ఉన్నప్పటికీ టోర్నీ జరగకపోతే ఉండే నష్టాలు కొన్ని ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అందరూ అంగీకరించేది ఒక్కటే. ప్రజల భద్రత, సంక్షేమం కన్నా ఏదీ ముఖ్యం కాదు"
- మరో ఫ్రాంచైజీ అధికారి
ఒకవేళ టోర్నీకీ ప్రభుత్వం విదేశీ ఆటగాళ్లను అనుమతించినా ఆ దేశ బోర్డులు వారిని పంపేందుకు అంగీకరిస్తాయో లేదో తెలియదని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే టోర్నీ రద్దుకు మానసికంగా సంసిద్ధులైనట్టే కనిపిస్తోంది.
ఇదీ చూడండి : భయం భయం.. క్రీడారంగంపై కరోనా ప్రభావం