గతేడాది ఐపీఎల్ తుదిపోరులో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిన దిల్లీ క్యాపిటల్స్.. ఈసారి ఆ ఒక్క మెట్టు ఎక్కాలనే లక్ష్యంతో ఉందని అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ అన్నాడు. అందుకోసం తమ ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. తన జట్టుతో కలిసిన కైఫ్ మీడియాతో మాట్లాడాడు. 'ఈ సీజన్‌లో మిగిలిన ఆ ఒక్క మెట్టు ఎక్కాలని అనుకుంటున్నాం. అదే మా లక్ష్యం. అది సాధించడానికి గల ఆటగాళ్లు మాకున్నారు' అని కైఫ్ పేర్కొన్నాడు.
'కప్పు సాధించడానికి గతేడాది మేం చాలా దగ్గరి వరకూ వెళ్లాం. అదే ఈసారి మాకు అతిపెద్ద సానుకూలత. పంత్‌తో పాటు చాలా మంది కీలక ఆటగాళ్లు ఇటీవల బాగా ఆడుతున్నారు. మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక మా క్రికెటర్లు ఇప్పటికే సాధన మొదలెట్టారు. ముఖ్యంగా ఇప్పుడు ఫ్లడ్‌లైట్ల కింద క్యాచులు పట్టడం నేర్చుకుంటున్నారు. ఈసారి కొంతమంది యువ ఆటగాళ్లు, అనుభవం లేని వారిని కూడా కలిశాను. అలాగే అశ్విన్, రహానె వంటి కీలక ఆటగాళ్లతో మాట్లాడాను. మా కోచ్ పాంటింగ్ ఇప్పుడు క్వారంటైన్‌లో ఉన్నారు. అతడిని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా. అతడు బయటకు రాగానే మా ప్రాక్టీస్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తాం' అని కైఫ్ చెప్పుకొచ్చాడు. దిల్లీ తొలి మ్యాచ్‌లో శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.