ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కొత్త సారథిగా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. వచ్చే సీజన్లో ఇతడే జట్టును నడిపించనున్నాడు. రాహుల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇతడిని 2018 ఐపీఎల్లో రూ.11 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుందీ జట్టు.
బ్యాటింగ్ కోచ్‌గా జాఫర్..
టీమిండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జాఫర్ ప్రస్తుతం దేళవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. విదర్భకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
2000-2008 కాలంలో జాఫర్ టీమిండియా తరఫున 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు, 11 అర్ధశతకాలు ఉన్నాయి. వెస్టిండీస్‌పై 2006లో సెయింట్ జాన్స్‌లో అద్భుతమైన ద్విశతకం (212) బాదేశాడు. ఎనిమిదేళ్ల కాలంలో కేవలం రెండు వన్డేలే ఆడాడు.
దేశవాళీ క్రికెట్లో జాఫర్‌ను దిగ్గజంగా భావిస్తారు. 254కు పైగా ఫస్ట్‌క్లాస్ మ్యాచులాడి దాదాపు 20వేల పరుగులు చేశాడు. ఈ మధ్యే 150వ రంజీ మ్యాచ్ ఆడి చరిత్ర సృష్టించాడు.
2008 అరంగేట్ర ఐపీఎల్లో జాఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు. 110 స్ట్రైక్ రేట్‌తో 130 పరుగులు చేశాడు. పంజాబ్ ప్రధాన కోచ్ అనిల్‌కుంబ్లే, జాఫర్‌కు మంచి అనుబంధం ఉంది. అతడిని బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేయడంలో జంబో ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా సునీల్ జోషి, ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పనిచేస్తున్నారు.