ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమానిని కదిలించినా వినిపిస్తోన్న పేరు ఐపీఎల్. సెప్టెంబరు 19 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. దీంతో ఎక్కడ చూసినా ఈ సందడే కనిపిస్తోంది. కరోనా లాక్డౌన్ తర్వాత జరుగుతున్న అతిపెద్ద లీగ్ ఇదే కావడం వల్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పలు ఫ్రాంచైజీలకు చెందిన భారత ఆటగాళ్లందరూ దుబాయ్ చేరుకున్నారు.
అయితే ఐపీఎల్లో.. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌కు అందించే పర్పుల్ క్యాప్ అవార్డు ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది. ఈ పురస్కారంలో భాగంగా మెమొంటోతో పాటు రూ.10 లక్షలు అతడికి అందజేస్తారు. దీన్ని చేజిక్కించుకోవాలనేది ప్రతి బౌలర్‌కు ఉండే కల. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి బ్యాట్స్‌మెన్‌పై వారు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా తమ బౌలింగ్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సీజన్లో పర్పుల్ క్యాప్ గెలుచుకునే సత్తా ఉన్న టాప్-5 బౌలర్లపై ఓ లుక్కేద్దాం.
జస్ప్రిత్ బుమ్రా..
ముంబయి ఇండియన్స్(ఎంఐ) బౌలింగ్ దళంలో కీలక ఆటగాడు బుమ్రా. బంతిని స్వింగ్, పేస్, బౌన్స్, నెమ్మదిగా విసరడంలో సిద్ధహస్తుడు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా పర్పుల్ క్యాప్‌ను అందుకోలేకపోయాడు. కానీ ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే రోహిత్ శర్మ నేతృత్వంలోని ఎంఐకి తిరుగులేనట్టే. ఇప్పటికే ఈ జట్టు నాలుగు సార్లు విజేతగా నిలిచి.. అత్యధిక టైటిల్స్‌ను కైవసం చేసుకున్న జట్టుగా కొనసాగుతోంది.
![bumrah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ipl-bumrah_0809newsroom_1599570833_586.jpg)
యుజ్వేంద్ర చాహల్
బెంగళూరు జట్టుకు బలమైన బౌలింగ్ దళం ఉంది. గతేడాది ఆర్సీబీలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లలో అతడి గణాంకాలు చూస్తే నిలకడగా రాణించే ఆటగాడని అర్థమవుతుంది. బరిలో దిగితే బ్యాట్స్‌మెన్‌పై చెలరేగిపోతాడు. మధ్య ఓవర్లలో చాహల్ బౌలింగ్ చేయడం జట్టు విజయానికి ఎంతో కీలకం. కాబట్టి ఈ సీజన్లోనూ అంతకుముందులా ఫామ్ కొనసాగిస్తే పర్పుల్ క్యాప్‌ను అందుకోవచ్చు.
![chahal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/chahal_0809newsroom_1599570833_618.jpeg)
డ్వేన్ బ్రావో..
టీ20ల్లో 500 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్ బ్రావో. చెన్నై జట్టులో కీలక ఆటగాడు. తనదైన బౌలింగ్ శైలితో డెత్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌పై పూర్తి ఆధిపత్యం సాధించగలడు. బరిలో దిగాడంటే బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పటికే 2013, 2015లో పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. ఈసారి కూడా ఈ అవార్డు బరిలో ఉన్నాడు.
![bravo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07:17:41:1599572861_ipl-bravo_0809newsroom_1599570833_1071.jpg)
ఇమ్రాన్ తాహిర్
గతేడాది పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు బౌలర్ ఇమ్రాన్ తాహిర్. భయంకరమైన లెగ్ స్పిన్‌తో సత్తాచాటగలడు. కనురెప్ప మూసి ఆర్పేలోగా బంతిని వేగంగా విసరగలిగే సామర్థ్యం ఉంది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆట రూపురేఖలనే మార్చేసి తమవైపుకు తిప్పుకుంటాడు. ఎటువంటి పిచ్‌పై అయినా అవలీలగా వికెట్లు తీస్తాడు. గతేడాది సీఎస్కే తరఫున ఆడిన ఇతడు.. 17 మ్యాచుల్లో 26 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. కాబట్టి ఈ సీజన్లోనూ రెండోసారి పర్పుల్ క్యాప్‌ను ఎగరేసుకుపోవచ్చు.
![tahir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tahirjpg_0809newsroom_1599570833_478.jpg)
కుల్దీప్ యాదవ్
కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ దళంలో లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు కుల్దీప్ యాదవ్. తనదైన బౌలింగ్ శైలితో బ్యాట్స్‌మెన్‌ను గందరగోళంలో పడేస్తుంటాడు. 2016 ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఇతడు.. 2107లో 12 వికెట్లు తీశాడు. 2018లో ఏకంగా 17వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఇప్పటివరకు పర్పుల్ క్యాప్‌ను గెలవలేకపోయాడు.
ఇదీ చూడండి ధోనీ కొట్టిన సిక్సర్‌కు మురళీ విజయ్ షాక్!