మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 13వ సీజన్ పండగ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన 12 లీగుల్లో ముంబయి ఇండియన్స్ అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలుస్తూ వచ్చింది. జట్టులో దృఢమైన టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌తో పాటు అద్భుతమైన బౌలర్లు ఉండటమే అందుకు కారణం.
గతేడాది టైటిల్‌తో నాలుగు సార్లు లీగ్ విన్నర్‌గా నిలిచిన ముంబయి.. ఈ ఏడాది కూడా ఎలాగైనా కప్పు దక్కించుకోవడమే లక్ష్యంగా కసరత్తులు చేస్తోంది. ఈ సారి జట్టులో రోహిత్ శర్మ, క్రిస్ లిన్, సూర్య కుమార్ యాదవ్, క్వింటన్ డికాక్ ఇషాన్ కిషన్ వంటి బలమైన ఓపెనర్లు ఉన్నారు. యూఏఈ వేదికగా జరిగే లీగ్‌లో జట్టుకు ఎవరి కలయికతో అదృష్టం వరించనుందో తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీజన్లో ముంబయి ఇండియన్స్ జట్టులో ఉత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యంపై ఓ లుక్కేద్దాం.
క్రిస్ లిన్- రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ జట్టులో బలమైన విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. గతంలో జరిగిన టోర్నమెంటుల్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ క్రమంలోనే రెండో ఓపెనర్‌గా క్రిస్ లిన్ దిగితే.. రోహిత్ శర్మకు ఉత్తమ భాగస్వామి దొరికినట్లే. వీరిద్దరి కలయికలో ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్‌ల్లో 130.82 స్ట్రైక్ రేట్‌తో 4,898 పరుగులు చేశాడు రోహిత్. వాటిలో ఒక సెంచరీతో పాటు 37 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు క్రిస్ లిన్ తన పేరుమీద 140.66 స్ట్రైక్ రేట్‌తో 10 అర్ధ సెంచరీలతో 1,280 పరుగులు నమోదు చేశాడు.

క్వింటన్ డి కాక్- రోహిత్ శర్మ
పిచ్ పరిస్థితులను బట్టి రోహిత్ శర్మకు ఓపెనింగ్ భాగస్వామి ఎవరనేది నిర్ణయిస్తారు. పిచ్ ఫ్లాట్‌గా ఉంటే.. డికాక్ ఆ వరుసలో నిలుస్తాడు. అప్పుడు రోహిత్ మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు అవకాశం లభిస్తుంది. ఒకవేళ రోహిత్‌తో భాగస్వామ్యం విషయంలో డి కాక్ విఫలమైతే.. తదనంతరం సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దక్షిణాప్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ డికాక్.. ఐపీఎల్లో 131.29 స్ట్రైక్ రేట్‌తో 1,456 పరుగులు చేశాడు.

క్వింటన్ డి కాక్- సూర్య కుమార్ యాదవ్
వీరిద్దరి కలయికలో ముంబయి మ్యాచ్ మొత్తం ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఒకరు లెఫ్ట్ హ్యాండ్, మరొకరు రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. సూర్య కుమార్ యాదవ్‌కు రంజీ ట్రోఫీ అనుభవం యూఏఈలో రాణించడానికి బాగా సాయపడుతుంది. ఇక వేగంగా పరుగులు సాధించే బాధ్యతను క్వింటన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ద్వయంతో ఐపీఎల్ 2020లో ముంబయి జట్టు సరైన గెలుపును సాధించగలదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యాదవ్ తన ఐపీఎల్ కెరీర్లో 131.63 స్ట్రైక్ రేట్‌తో 7 అర్ధ సెంచరీలతో కలిపి 1,544 పరుగులు చేశాడు.