ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది టీమ్ఇండియా. చివరిదైన నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు ప్రదర్శించిన తెగువ మరువలేనిది. అయితే ఈ ఆటగాళ్లేమీ కోటీశ్వరుల కుటుంబాల్లో పుట్టి పెరగలేదు. చిన్న గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చి వారి కలను సాకారం చేసుకునేందుకు శ్రమించారు. దాని ఫలితమే ఈరోజు కోట్లాది మంది అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో హీరోలుగా నిలిచిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
రిషభ్ పంత్
పంత్ స్వస్థలం రూర్కీ. ఇతడి తల్లిదండ్రులు రాజేంద్ర పంత్, సరోజ్ పంత్. వారాంతాల్లో తల్లితో కలిసి దిల్లీ వెళ్లి తారక్ సిన్హా సోనెట్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకునేవాడు. ఈ సమయంలో పంత్, అతడి తల్లితో కలిసి మోతీ భాగ్‌లోని గురుద్వారాలో ఉండేవాడు. పంత్ తండ్రి రాజేంద్ర చనిపోయిన కొన్ని రోజుల్లోనే అతడు ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.
తనదైన దూకుడు ఆటతో అనతికాలంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు పంత్. కానీ వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలయ్యాడు. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో సత్తాచాటి హీరోగా నిలిచాడు. మూడు, నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు చూపిన తెగువ మరువలేనిది.
మహ్మద్ సిరాజ్
హైదరాబాద్ బంజారాహిల్స్ ఖాజానగర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు సిరాజ్. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి రోజూ వారి కూలీ. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన మహ్మద్ సిరాజ్‌కు క్రికెటే లోకమైంది. సిరాజ్ ఉత్సాహానికి తండ్రి ప్రోత్సాహం అందడం వల్ల ముందుకెళ్లాడు. మెరుపు వేగంతో బంతులు వేస్తూ గల్లీ క్రికెట్‌లో.. స్థానిక టోర్నీల్లో హీరోగా మారిపోయాడు.
తర్వాత ఐపీఎల్‌లో మెరుపులతో సిరాజ్ అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే అక్కడికెళ్లాక అతడి తండ్రి మరణించాడన్న వార్త విన్నాడు. ఆ సమయంలో.. భారత్‌కు తిరిగి వచ్చేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తామన్నా అతడు నిరాకరించాడు. భారత్‌కు వెళ్లి వస్తే క్వారంటైన్ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో అక్కడే ఆగిపోయాడు. తండ్రి కోరుకున్నట్టుగా దేశానికి సేవ చేయడమే ప్రధానమని నిశ్చయించుకున్నాడు. ఈ పర్యటనలో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో రాణించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
నవదీప్ సైనీ
కర్నాల్‌లోని ఓ బస్‌డ్రైవర్ తనయుడు నవదీప్ సైనీ. 1000 రూపాయలకు టెన్నిస్ బంతితో మ్యాచ్‌లు ఆడేవాడు. రంజీ ట్రోఫీ సమయంలో నెట్స్‌లో బౌలింగ్ చేసేందుకు ఇతడికి అవకాశమిచ్చాడు దిల్లీ ఫస్ట్‌క్లాస్ ప్లేయర్ సుమిత్ నర్వాల్. తర్వాత కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఇతడికి జట్టులో చోటు కల్పించాడు. కానీ దిల్లీ కాకుండా వేరే రాష్ట్రం నుంచి ఆటగాడిని తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు బిషన్ సింగ్ బేడీ. కానీ సైనీ ప్రతిభను గుర్తించిన గంభీర్ అతడికి మద్దతుగా నిలిచాడు.
శుభ్‌మన్ గిల్
పంజాబ్‌లోని ఫజిల్కా గ్రామంలో జన్మించాడు గిల్. ఇతడి కోసం తాత వ్యవసాయ క్షేత్రంలో పిచ్‌ను తయారు చేసేవాడు. గిల్ ప్రతిభను గుర్తించిన అతడి తండ్రి మొహలీకి మకాం మార్చాడు. దీంతో గిల్ క్రికెట్ కెరీర్‌కు రెక్కలొచ్చాయి. అండర్-19 ప్రపంచ కప్ జట్టులో ఇతడు సభ్యుడు. ఆస్ట్రేలియా పర్యటనలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓపెనర్‌గా సుస్థిర స్థానం సాధించే వైపు అడుగులు వేస్తున్నాడు.
ఛెతేశ్వర్ పుజారా
రాజ్‌కోట్‌కు చెందికి పుజారా చాలా నెమ్మదస్తుడు. ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడలేడు. కానీ ఇతడి ఓపిక, బలమైన మానసిక సామర్థ్యం ఇతడిని గొప్ప టెస్టు ప్లేయర్‌గా తీర్చిదిద్దాయి. ఇతడి తండ్రి, కోచ్ అరవింద్ పుజారా వల్లే ఇది సాధ్యమైందని అతడు చాలాసార్లు చెప్పాడు. జూనియర్ క్రికెట్ ఆడుతున్నపుడు ఇతడి తల్లి మరణించింది. కానీ ఆ ఘటన పుజారా క్రికెట్ ప్రయాణానికి ఏమాత్రం అడ్డుకాలేకపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో శరీరానికి ఎన్ని బంతులు తగిలినా మొక్కవోని దీక్షతో పుజారా చూపిన తెగువను ప్రతి క్రికెట్ అభిమాని కలకాలం గుర్తుంచుకుంటాడు.
శార్దూల్ ఠాకూర్
పాల్ఘర్ నుంచి వచ్చిన శార్దూల్ ఠాకూర్ పాఠశాల స్థాయిలో జరిగిన పోటీల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. హరీస్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ తరఫున ఈ ఘనత సాధించాడు. ఇతడితో పాటు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా చిన్నతనంలో దినేశ్ లాడ్ వద్ద కోచింగ్ తీసుకోవడం విశేషం. దినేశ్ తనయుడు సిద్దార్థ్ లాడ్ ముంబయికి ఆడాడు. ప్రధాన పేసర్లకు గాయాలు కావడం వల్ల జట్టులోకి వచ్చిన శార్దూల్ బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణించి ఆకట్టుకున్నాడు.
వాషింగ్టన్ సుందర్
వాషింగ్టన్ సుందర్ వాళ్ల నాన్న ఎమ్.సుందర్. ఆయన కూడా క్రికెటర్. కానీ పేదరికం కారణంగా ఆటలో కొనసాగలేకపోయారు. అప్పుడే పొరుగునే ఉండే ఆర్మీ మాజీ అధికారి పీడీ వాషింగ్టన్.. ఆయనకు ఆర్థికంగా సాయం చేసేవారు. తన చదువుకు ఫీజు కట్టడం, యూనిఫామ్, పుస్తకాలు కొనివ్వడం, గ్రౌండ్‌కు సైకిల్‌పై తీసుకెళ్లడం లాంటివి చేసేవారు. క్రికెట్‌పైన మక్కువతో వీరు ఆడే ఆటను ఇష్టంగా చూసేవారు వాషింగ్టన్. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర స్థాయి వరకు ఆడాడు ఎమ్.సుందర్. అందులో వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉంది. అందుకు కృతజ్ఞతగా ఆయన జ్ఞాపకార్థంగా, తన తొలిబిడ్డకు వాషింగ్టన్ పేరు పెట్టుకున్నారు ఎమ్.సుందర్. 1999లో వాషింగ్టన్ సుందర్ పుట్టడానికి కొన్ని నెలల ముందే పీడీ వాషింగ్టన్ చనిపోయారు. తనకు ఇంకో కొడుకు పుట్టి ఉంటే అతడికి జూనియర్ వాషింగ్టన్ అని పెట్టేవాడినని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఎమ్. సుందర్. ఐపీఎల్‌లో సత్తాచాటినా జాతీయ జట్టులో మాత్రం స్థిరంగా ఇతడికి అవకాశాలు రాలేదు. తాజాగా జడేజా, అశ్విన్ గాయాలతో జట్టులోకి వచ్చిన సుందర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
నటరాజన్
నటరాజన్ తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. కుమారుడి క్రికెట్ కలను నెరవేర్చేందుకు శాయశక్తులా కష్టపడేవారు. కనీస సదుపాయాలు లేనప్పటికీ ఫాస్ట్ బౌలింగ్‌లో రాణించే నటరాజన్‌కు జయప్రకాశ్ అనే వ్యక్తి సాయం చేశాడు. దీంతో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకుని, వెలుగులోకి వచ్చాడు. యార్కర్లు పక్కాగా వేసే ఇతడిని, 2017 వేలంలో పంజాబ్ జట్టు రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. గాయాలవడం వల్ల ఆ సీజన్ పూర్తిగా ఆడలేకపోయాడు. కానీ వచ్చిన మొత్తంతో తన ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడం సహా సొంతూరిలో క్రికెట్ అకాడమీని కూడా ప్రారంభించాడు. అయితే ఈ ఏడాది హైదరాబాద్ జట్టు తరఫున అదరగొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్‌గా ఎంపికై, అనూహ్యంగా తుదిజట్టులో చోటు దక్కించుకుని ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. సహచరుల నుంచి మాజీల వరకు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
అజింక్యా రహానె
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ భారత్ దక్కించుకోవడంలో సారథిగా పూర్తిగా సఫలమయ్యాడు అజింక్యా రహానె. చిన్నప్పుడు ముంబయి లోకల్ ట్రైన్లో రోజూ ములంద్ నుంచి అజాద్, క్రాస్ మైదాన్‌కు ప్రాక్టీస్ కోసం వెళ్లేవాడు. చిన్నప్పుడే కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించాడు. అలాగే టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ప్రమీణ్ ఆమ్రే నుంచి క్రికెట్ మెళకువలు నేర్చుకున్నాడు.
అయితే రహానె తన తొలి మ్యాచ్ ఇండియాలో ఆడలేదు. పాకిస్థాన్‌లో తన మొదటి మ్యాచ్ ఆడటం గమనార్హం. కరాచి వేదికగా ఖ్వైత్ ఈ అజామ్ ఛాంపియన్ కరాచీ అర్బన్స్తో జరిగిన మ్యాచ్‌లో రంజీ ఛాంపియన్ ముంబయి తరఫున బరిలో దిగాడు రహానె.