దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు భారత క్రికెటర్ రిషభ్ పంత్. కీపింగ్‌లోనూ బాగా నిరాశపర్చాడు. ఫలితంగా తుది జట్టులో చోటు దక్కించుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. త్వరలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ పర్యటన కోసం టీ20, టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అనంతరం.. భారత మాజీ కెప్టెన్ ధోనీని శుక్రవారం కలిశాడు. అతడితో తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు రిషభ్.
ధోనీని ఆరాధించే రిషభ్ పంత్... మళ్లీ తన గురువుతో కలిసి కాసేపు గడపడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. ఆ ఫొటోల్లో మహీతో మాట్లాడుతూనే కుక్కలతో ఆడుకుంటూ కనిపించాడు పంత్.
విపరీతమైన పోటీ...
ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు ధోనీ. ఫలితంగా యువ కీపర్ రిషభ్ పంత్‌కు అవకాశాలిస్తున్నారు టీమిండియా సెలక్టర్లు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. తాజాగా బంగ్లాతో సిరీస్‌కు చోటిచ్చారు. ఇప్పటికే ఇతడితో టెస్టుల్లో సాహా, టీ20ల్లో సంజూ శాంసన్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ కీపింగ్, బ్యాటింగ్‌లో బాగానే రాణిస్తున్నారు.
ఈ ఏడాది 9 వన్డేలు ఆడిన పంత్.. 188 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 48. 10 టీ20లు ఆడి 168 పరుగులు చేశాడు. ఇంతలా నిరాశపర్చినా, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని పంత్‌కు అవకాశమివ్వాలని సెలక్టర్లకు సూచించాడట ధోనీ. ప్రతిగా ధన్యవాదాలు చెప్పేందుకు, మహీ దగ్గరకు పంత్ వెళ్లి ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవే వేదికలు...
బంగ్లాతో తొలి టీ20 దిల్లీ (నవంబర్ 3), రెండో మ్యాచ్ రాజ్‌కోట్ (7న), మూడోది నాగ్‌పూర్ (10న)లో జరుగనున్నాయి. ఇండోర్, కోల్‌కతా వేదికలుగా... రెండు టెస్టులు(నవంబర్ 14 నుంచి) ఆడనుంది కోహ్లీసేన.
15 మంది జాబితా ఇదే...
టీ20 జట్టు: రోహిత్‌శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్(కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, చాహల్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకుర్
టెస్టు జట్టు: కోహ్లీ (సారథి), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారీ, సాహా(కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, షమి, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్