క్రికెట్‌లోని రాజకీయాలతో పోరాడుతూనే మైదానంలో పరుగులు తీస్తుంటాడు భారత సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు. చిన్నప్పటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే రాయుడు.. తన కెరీర్ ఆరంభం నుంచి వివాదాలతోనే పోరాడాడు. ఒక ఆటగాడిగా మాత్రమే తెలిసిన ఈ తెలుగు కుర్రాడు.. సాధారణ జీవితం గడుపుతుంటాడు. పొలాల్లో రైతుగా కనిపిస్తాడు. క్రికెట్ అంటే వ్యవసాయమే అంటున్న ఈ క్రికెటర్.. తన మనసులోని మాటలు, జీవితంలోని సంఘటనలు ఇలా చెప్పుకొచ్చాడు.
పరీక్షలు ఆలస్యంగా రాశా...
నేనో మంచి విద్యార్థిని. చదువులో ఎప్పుడూ ఫస్టే. నాన్నకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే నన్ను క్రికెట్లో చేర్పించారు. మెల్లగా ఆటపై ఇష్టం పెరిగింది. క్రికెట్ అయిపోయాక చదువుకోవచ్చులే అనుకున్నా. కానీ ఆ తర్వాత ఆటే ప్రపంచంగా మారిపోయింది. అందుకే పదో తరగతి పరీక్షలూ ఓ ఏడాది ఆలస్యంగానే రాశా. బీసీసీఐ స్కాలర్‌షిప్ మీద ఆస్ట్రేలియాలో ఒక ఏడాది క్రికెట్లో శిక్షణ తీసుకున్నా. తిరిగి వచ్చాక పరీక్షలు రాశా.
సీనియర్లతో దోస్తీ...
13 ఏళ్లప్పుడే హైదరాబాద్ అండర్-19 జట్టుకు ఆడాను. ఒకే ఏడాది అండర్-14, అండర్-16, అండర్-19లో ఆడాల్సి వచ్చింది. బౌలర్లు నాకంటే పెద్దవాళ్లైనా పట్టించుకునేవాడిని కాదు. నాకు బంతితోనే పని. సీనియర్లు బాగా సహకరించేవాళ్లు. ఇప్పుడున్న రాజకీయాలు అప్పుడు లేవు. ప్రతిభ ఉంటే ప్రోత్సాహం లభించేది.
గాడ్ ఫాదర్ లేడు కాబట్టే..
కెరీర్‌లో ఎక్కువ శాతం ఏదో ఒక విధంగా అడ్డంకులు ఎదురయ్యేవి. ఆ సమయంలో కాపాడేందుకు నాకు ఈ ఆటలో గాడ్‌ఫాదర్ లేడు. సహాయం కోసం ఎవర్నీ అడిగే మనస్తత్వం నాదికాదు. ప్రతిభతోనే టీమిండియాకు ఆడానన్న సంతృప్తి నాకెప్పటికీ ఉంటుంది. ప్రస్తుతం తల్లిదండ్రులు, పిల్లల ఆలోచన దృక్పథం సరిగా లేదు. దగ్గరిదారిలో వచ్చి ఆడితే ఎప్పటికీ గొప్ప క్రికెటర్ కాలేరు. అత్యున్నత స్థాయికి చేరుకోలేరు. నిజాయతీగా పరుగులు సాధించాలి. కింద పడినా సొంతంగా పైకి లేవాలి. అప్పుడే పరిణతి వస్తుంది. ఆటపై అవగాహన పెరుగుతుంది.
విలువలు లేకుండా బతకలేను..
యువకుడిగా ఉన్నప్పుడే ఆటుపోట్లన్నీ అలవాటయ్యాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఎంత కష్టం వచ్చినా విలువలు వదులుకోలేదు. ఎంతోమంది ఇంటికి వచ్చి నాన్నతో బేరసారాలు ఆడారు. అయినా ఆయన దిగజారలేదు. ఇంట్లో అందరం అంతే. తప్పు చేయొద్దన్న ఆలోచన మనసులో ఉండిపోయింది. విలువలు లేకుండా బతకడం మా వల్ల కాదు. కొంచెం రాజీపడుంటే టీమిండియా తరఫున ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు ఆడేవాడినేమో.
ఏకాగ్రత, అంకిత భావం కావాలి..
అండర్-19 ప్రపంచకప్‌లో నా నాయకత్వంలో ఆడిన సురేశ్ రైనా, దినేశ్ కార్తిక్, ఇర్ఫాన్ పఠాన్ నా కంటే ముందు భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఆ సమయంలో నేను మంచి ప్రదర్శన చేసేవాడిని. కాకపోతే 24, 25 ఏళ్ల వయసులోనే పూర్తి స్థాయి పరిణతి వస్తుంది. టీమిండియాకు ఆడాలంటే ఏకాగ్రత, అంకితభావం అత్యున్నత స్థాయిలో ఉండాలి. తక్కువ వయసులో ఆడినా విజయవంతమయ్యే అవకాశాలు చాలా తక్కువ. నా బ్యాచ్‌లో సురేశ్ రైనా మినహా తొందరగా ఆడినవాళ్లు ఏమంత విజయవంతం కాలేదు.
సాధారణ జీవితమే ప్రశాంతం...
23 ఏళ్ల వయసు నుంచే నాకు ఎదురైన అన్యాయాన్ని ప్రశ్నించాలనుకున్నా. ధైర్యంగా ఎదుర్కోవాలని భావించా. కానీ అవన్నీ నాకు అనవసరం అని తర్వాత తెలుసుకున్నా. ఆటే ముఖ్యమని అనుకున్నా. కెరీర్‌కు.. జీవితానికి ఏది మంచో అదే చేయాలని ముందుకు పరిగెత్తా. నన్ను మెరుగ్గా తీర్చిదిద్దుకొని నా జోన్‌లోకి వెళ్లిపోయా. సాధారణ జీవితంతోనే ప్రశాంతత అని గుర్తించిన తర్వాత వీలైనప్పుడు ఐపీఎల్‌లో ఆడాను. టీమిండియా తరఫున కొన్నిమ్యాచ్లు బరిలోకి దిగాను.
అందుకే ఆతిథ్యం..
హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా బిర్యానీ తినడం అలవాటు. టీమిండియా ఎక్కడికి వెళ్లినా ఆయా ప్రాంతాలకు చెందిన ఆటగాళ్ల ఇంట్లోనో.. హోటల్లోనో అక్కడి వంటకాలు తినిపించడం ఆనవాయితీగా వస్తుంది. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నేను కూడా అందరికీ ఆతిథ్యమిచ్చా.
వాళ్లే నా స్నేహితులు..
క్రికెట్ సర్కిల్‌లో నాకు స్నేహితులు తక్కువ. వాళ్లంతా మైదానం వరకే. పాఠశాలలో చదువుకున్నవాళ్లే ఇప్పటికీ నాకు మంచి స్నేహితులు. కొందరు సైనిక్‌పురి పరిసరాల్లోనే ఉంటారు. కొందరు అమెరికాలో స్థిరపడ్డారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కలుస్తారు. వాళ్లతోనే తిరుగుతా.
అదే నా జీవితం
నా మైండ్‌సెట్ వేరు. వేరేవాళ్లు తప్పని కాదు. మైదానంలో ఉన్నంత వరకే క్రికెట్. మైదానం దాటిన తర్వాత దాన్ని కొనసాగించడం.. క్రికెట్ పేరు చెప్పుకోవడం అనవసరం అనిపిస్తుంది. బయటి జీవితం పూర్తిగా భిన్నం. నాకు నచ్చినట్లుగా జీవిస్తా.
వ్యవసాయంటే చాలా ఇష్టం..
వ్యవసాయం, గ్రామీణ వాతావరణమంటే నాకు చాలా ఇష్టం. తాత వాళ్లకు పంటపొలాలు ఉండేవి. పదేళ్లుగా నేను వ్యవసాయం చేస్తున్నా. అన్ని రకాల పంటలు, తోటలు, నేలలపై విస్తృతంగా అధ్యయనం చేశా. ఇప్పుడు పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలో సాగు చేస్తున్నా. నీమ్ ఆయిల్, గోమూత్రంతో పంటలు పండిస్తా. పురుగుమందుల వంటివి అస్సలు వాడను. క్రికెట్ లేనప్పుడు తోట దగ్గరే నా రోజంతా గడుస్తుంది.
కార్లంటే పిచ్చి...
కార్లు అంటే నాకు చాలా ఇష్టం. బైక్‌లు ఎక్కువగా నడపను. కారుతో చేయాల్సిన కోతి పనులన్నీ చేశా. ఇటీవలే మస్టాంగ్ కారు కొన్నా. ఫార్ములా వన్ రేసుల్ని ఫాలో అవుతా. చెన్నైలో ట్రాక్‌లు ఉన్నాయి. ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు. కెరీర్ ముగిశాక ప్రయత్నిస్తా.
రిటైర్మెట్ తర్వాత అదే చేస్తా
వంట చేయడం నాకిష్టం. పారిస్‌లో ప్రముఖ కళాశాల ఉంది. అక్కడ 6 నెలలు చెఫ్ కోర్సు ఉంది. అది పూర్తి చేస్తా. నేను వంట చాలా బాగా చేస్తా. అందుకే చెఫ్ కోర్సు చేయాలనుకుంటున్నా. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్లో అడుగుపెట్టను. ఎవరైనా సాయం కావాలంటే చేస్తా. వారిలో నిజాయతీ ఉందని అనిపిస్తేనే. చిట్కాలు చెప్పమంటే చెప్తా. వీలైతే 'ఆర్కిటెక్చర్' లేదా 'లా' కూడా చదవాలని ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల చదవు
నాకింకా పిల్లలు లేరు. పుట్టాక.... వారిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తా. ఎక్కడైనా ఒకటే పాఠ్యప్రణాళిక. ఏబీసీడీలను స్టైల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. పదో తరగతి వరకు వాళ్లను స్వేచ్ఛగా ఉండనివ్వాలి. అన్నీ తెలుసుకోవాలి. ఏసీ రూమ్‌లో ఉంచి ఇదే ప్రపంచమని కూర్చోబెడితే వృథా. బయటి జీవితం ఎలా ఉంటుందో వారికి తెలిసేలా చేయాలి.
ఆలా ఉండటమే నాకు ఇష్టం
సిద్దిపేట సమీపంలోని అప్పర్ మానేరు దగ్గర తోట ఉంది. ఇల్లు కూడా కట్టుకున్నా. ఎక్కువ శాతం అక్కడే ఉంటా. ఫోన్ ఉండదు. అందరితో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు తోటలోనే పనిచేస్తా. ఆ సమయంలో క్రికెటర్ అని నా మెదడులో ఉండదు. మైదానం ఆవల నేను సాధారణ వ్యక్తినే. స్నేహితులతో ఉన్నప్పుడు నేను క్రికెటర్‌ను అని బిల్డప్ ఇవ్వను. వాళ్లలో కొందరు ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారు. నేను క్రికెటర్ అయ్యా. వాళ్ల పని కనిపించదు. నేను ఆడింది టీవీల్లో కనిపిస్తుంది. అంతమాత్రాన నేనేం గొప్పోడిని కాదు. ఈ విషయంపై స్పష్టత ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
సెల్‌ఫోన్‌కు దూరం
నేను ప్రశాంతంగా ఉండటానికి సెల్‌ఫోన్ లేకపోవడమే కారణం. దీని వల్ల మనకు మనం దూరమయ్యే ప్రమాదముంది. సెల్‌కు దూరంగా ఉండటం వల్ల నాకు లాభమే కలిగింది. 7, 8 ఏళ్లు నా అత్యుత్తమ క్రికెట్ ఆడగలిగా. సమాచారం అందించాల్సింది కుటుంబ సభ్యులకు మాత్రమే. వారితో ఎలాగైనా మాట్లాడొచ్చు. మిగతా వాళ్లతో రోజూ మాట్లాడాల్సిన పనిలేదు. టోర్నీల సమయంలో ఫోన్ అవసరమే ఉండదు. నా పద్ధతి మిగతా ఆటగాళ్లకీ తెలుసు కాబట్టి దాన్ని గౌరవిస్తారు. దొరికిన కొద్ది సమయంలోనూ సెల్‌ఫోన్‌లో బందీ అవడం ఇష్టముండదు. సెల్‌ఫోన్ వల్ల సమయం, శక్తి రెండూ వృథా. వార్తలు, సమాచారం కోసం టీవీ పెడితే 10 నిమిషాల్లో అన్నీ తెలిసిపోతాయి. సెల్‌ఫోన్ ద్వారా అనవసర సమాచారమే ఎక్కువ.
అది నా రెండో ఇల్లు..
జింఖానా మైదానంతో విడదీయలేని అనుబంధం నాది. హైదరాబాద్‌లోని ప్రతి క్రికెటర్‌దీ అదే పరిస్థితి. ఉదయం 4.30 గంటలకు మైదానానికి వస్తే పొద్దుపోయేదాకా అక్కడే మకాం. అప్పట్లో జింఖానా మైదానం నాకు రెండో ఇల్లు. పిచ్‌పై పేస్, బౌన్స్ బాగుండేది. స్ట్రోక్స్ ఆడుతుంటే ఆ మజానే వేరు. హైదరాబాదీ శైలి బ్యాటింగ్‌కు జింఖానా పిచ్ బాగా నప్పుతుంది. హైదరాబాద్ క్రికెట్ సంస్కృతికి జింఖానా మైదానం ప్రతిబింబం.
కుంగిపోవద్దు..
క్రీడాకారుల కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. గెలుస్తున్నప్పుడు అవసరం లేకున్నా ఇంకా ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్తారు. ఓడిపోతుంటే అంతకంటే తక్కువ స్థాయికి తీసుకెళ్తారు. బాగా ఆడుతున్నామని పొంగిపోవద్దు. ఓడినప్పుడు కుంగిపోవద్దనేది నా సిద్ధాంతం.
జీవితం చాలా సాధారణం. అన్నీ అలాగే ఉండాలి. అతిగా ప్రవర్తించొద్దు. అంచనాలు తక్కువున్నప్పుడు అన్నీ సులువుగా అయిపోతాయి. అందరూ నన్ను గుర్తించాలి.. నాకు ప్రత్యేకత ఉండాలి.. నాకే ఎక్కువ మర్యాద ఇవ్వాలి అనుకున్నప్పుడే సమస్య.
ప్రపోజ్ చేసినా..
ఎవరు ప్రపోజ్ చేసినా పట్టించుకునేవాడిని కాదు. అప్పుడు నా ధ్యాసంతా ఆట మీదే ఉండేది. మిగతావన్నీ టైమ్ వేస్ట్ అనిపించేవి.