ఐపీఎల్ మొదలైందంటే తమ జట్టే గెలుస్తుందంటూ ప్రతి అభిమాని ఆశిస్తాడు. కానీ చివరికొచ్చే సరికి ఎవరో ఒకరినే టైటిల్ వరిస్తుంది. ముంబయి, చెన్నై చెరో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. కోల్‌కతా, హైదరాబాద్ జట్లు రెండు సార్లు గెలుచుకున్నాయి. మరి ఈసారి బరిలోకి దిగుతున్న జట్లకున్న బలాలు, బలహీనతలూ చూసేద్దామా..!
రాజస్థాన్ రాయల్స్
2008 ప్రారంభ ఐపీఎల్‌లోనే విజేతగా నిలిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. 2015, 2018లలో ప్లే ఆఫ్ చేరడం మినహా మిగతా సీజన్లలో అంతగా ఆకట్టుకోలేక పోయింది.
- బలాలు: ఐసీసీ విధించిన ఏడాది నిషేధం తర్వాత పునరాగమనం చేస్తోన్న స్టీవ్ స్మిత్ ఆ జట్టుకు అదనపు బలం. అజింక్యా రహానే, సంజు శాంసన్, బట్లర్, బెన్ స్టోక్స్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో క్రిష్ణప్ప గౌతమ్, ఇష్ సోధి, శ్రేయాస్ గోపాల్ లాంటి స్పిన్నర్లున్నారు.
- బలహీనతలు: అజింక్యా రహానె ఫామ్ అందుకోవడం ముఖ్యం. ఏడాది కాలంగా టీట్వంటీ క్రికెట్లో స్థిరంగా ఆడట్లేదు. పేస్ విభాగంలో జట్టు కొంచెం బలహీనంగా ఉంది. జోఫ్రా ఆర్చర్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్‌బౌలర్ లేడు. గత సీజన్లో ఎక్కువ ధర పెట్టి తీసుకున్న జయదేవ్ ఉనాద్కట్ నిరాశపరిచాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
2014లో రన్నరప్‌గా నిలిచింది పంజాబ్ జట్టు. తొలి సీజన్లో సెమీస్ వరకు చేరింది. ఈ రెండు సార్లు మినహా ఐపీఎల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రతిసారి కెప్టెన్లను, ఆటగాళ్లను మార్చినా ఫలితం రాలేదు.
- బలాలు: అనుభవం గల రవిచంద్రన్ అశ్విన్ జట్టును నడిపించనున్నాడు. గతేడాది కూడా కెప్టెన్‌గా మెప్పించాడీ లెగ్ స్పిన్నర్. అశ్విన్‌తో కలిసి స్పిన్ బౌలింగ్‌లో ముజిబర్ రెహమాన్ కీలక పాత్ర పోషించనున్నాడు. రాహుల్, గేల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్‌లతో బ్యాటింగ్‌లో దుర్భేద్యంగా ఉంది. రాహుల్ గత సీజన్లో 659 పరుగులు చేసి ఆకట్టుకోగా, గేల్ 368 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ ఈ జట్టుకు కీలకం కానున్నారు.
- బలహీనతలు: ఆల్‌రౌండర్లు ఆండ్రూ టై, హెండ్రిక్స్ సగం మ్యాచ్‌లకే అందుబాటులో ఉంటారు. మిడిల్ ఆర్డర్లో కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్ ఫామ్ అందుకోవడం అవసరం.
దిల్లీ క్యాపిటల్స్
తొలి రెండు సీజన్లు మినహా మిగతా టోర్నీల్లో ప్లే ఆఫ్స్‌కి కూడా చేరలేదు. ఈ సారి ఎలాగైనా కప్పు గెలవాలనే కసితో ఉంది క్యాపిటల్ జట్టు.
- బలాలు: రికీ పాంటింగ్ దిల్లీ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుండటం ప్రధాన బలం. హైదరాబాద్ నుంచి శిఖర్ ధావన్ రాకతో బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తోంది. పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ లాంటి టీ 20 స్పెషలిస్టులు జట్టులో ఉన్నారు. బౌలింగ్ రబాడా, ట్రెంట్ బౌల్ట్ లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. ఆలౌరౌండర్లు క్రిస్ మోరిస్, హనుమ విహారి, అక్షర్ పటేల్‌లతో సమతూకంగా ఉంది.
- బలహీనతలు: సరైన దేశీయ టీ20 బౌలర్ లేకపోవడం పెద్దలోటు. ఇషాంత్ శర్మ తప్ప చెప్పకోదగ్గ దేశవాళీ బౌలర్ కనిపించట్లేదు.
కోల్‌కతా నైట్ రైడర్స్
గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 ఏడాది టైటిళ్లను ఎగరేసుకుపోయింది కోల్‌కతా నైట్‌రైడర్స్. గత సీజన్లో గంభీర్ దిల్లీకి ప్రాతినిధ్యం వహించగా.. దినేశ్ కార్తీక్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
- బలాలు: దినేశ్ కార్తీక్ గత సీజన్లో 498 పరుగులు చేసి జట్టును మూడో స్థానంలో నిలిపాడు. ఓపెనర్లు క్రిస్ లిన్, సునీల్ నరైన్ జట్టుకు అదనపు బలం. ఇద్దరూ భారీ షాట్లు ఆడగల సమర్థులు. సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్ లాంటి అంతర్జాతీయ స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో ఆండ్రూ రసెల్, బ్రాత్‌వైట్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
- బలహీనతలు: గత సీజన్లో పేస్ విభాగం కొంచెం బలహీనతగా ఉంది. విండీస్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్, రసెల్ ఉన్నప్పటికీ అంతగా ప్రభావం చూపలేదు. ఈసారి వీరు ఎంత వరకు జట్టు గెలుపునకు కృషి చేస్తారన్నది తెలియాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్
2013లో తొలిసారి ఐపీఎల్లో ప్రవేశించిన సన్‌రైజర్స్ జట్టు తొలి సీజన్లోనే ప్లే ఆఫ్స్‌కి చేరింది. 2016లో టైటిల్ నెగ్గి సత్తా చాటి.. గతేడాది రన్నరప్‌గా నిలిచింది.
- బలాలు: డేవిడ్ వార్నర్ పునరాగమనం చేస్తుండటం జట్టుకు కలిసొస్తుంది. మార్టిన్ గప్తిల్, కేన్ విలియమ్సన్‌లతో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. భువనేశ్వర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, కౌల్, ఖలీల్ అహ్మద్‌లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. గత రెండు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ సన్ రైజర్స్ ఆటగాళ్లకే దక్కడం (వార్నర్, విలియమ్స్‌న్) విశేషం.
- బలహీనతలు: మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండే, సాహాలు ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2009, 2011, 2016 టోర్నీల్లో మూడు సార్లు ఫైనల్‌కి వెళ్లి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దిగ్గజాలకు కొదవలేకున్నా ఈ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. ఈ సారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగుతోంది.
- బలాలు: బెంగళూరుకి ప్రధాన బలం ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. డివిలియర్స్, హెట్మైర్, మొయిన్ అలీ, స్టాయినీస్, గ్రాండ్ హోమ్ లాంటి ఆటగాళ్లతో జట్టు బలంగా ఉంది. బౌలింగ్‌లో సౌధి, చాహల్, ఉమేశ్ యాదవ్, షమీ ఉన్నారు.
- బలహీనతలు: విరాట్‌పైనే ఎక్కువగా ఆధారపడటం, సుస్థిరత లేకపోవడం బెంగళూరు జట్టుకున్న ప్రధాన సమస్య. బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్నా.. బౌలింగ్‌లో ఇబ్బంది పడుతోంది.
ముంబయి ఇండియన్స్
మూడుసార్లు(2013, 2015, 2017) కప్పు గెలుచుకుంది ముంబయి. నాలుగోసారి ట్రోఫీ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
- బలాలు: రోహిత్ శర్మ కెప్టెన్సీ ఆ జట్టుకు ప్రధాన బలం. డికాక్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలతో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. పాండ్యా సోదరులు, పోలార్డ్ మిడిల్ ఆర్డర్లో రాణిస్తున్నారు. బుమ్రా, మయాంక్ మార్ఖండేలతో బౌలింగ్‌లోనూ బాగుంది. మ్యాక్స్‌వెల్, యువరాజ్ రాక బ్యాటింగ్‌లో జట్టుకు అదనపు బలం చేకూర్చనుంది.
- బలహీనతలు: ముంబయి ప్రధాన సమస్య సుస్థిరత లేకపోవడం. గత సీజన్లో మయాంక్ మార్ఖండే మొదట్లో ఆకట్టుకున్నా తర్వాత విఫలమయ్యాడు. యువరాజ్, పోలార్డ్, మిచెల్ మెక్లెగాన్ ఫామ్ అందుకోవాలి.
చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ప్రతి సీజన్లో ప్లే ఆఫ్‌కి చేరిన ఏకైక జట్టు చెన్నై. మూడు సార్లు విజేత.. ఏడు సార్లు రన్నరప్‌గా నిలిచి విజయవంతమైన టీమ్‌గా పేరుగాంచింది.
- బలాలు: కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వ్యూహాలు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు ప్రధాన బలం. అంబటి రాయుడు, సురేశ్ రైనా, ధోనీలతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో బ్రేవో, శార్దుల్ ఠాకూర్, ఎంగిడి, మోహిత్ శర్మలు ఆకట్టుకుంటున్నారు. హర్భజన్ సింగ్, తాహిర్ లాంటి అనుభవం గల స్పిన్నర్లున్నారు.
- బలహీనతలు: జట్టులో ఎక్కువ మంది రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్నవాళ్లే. చూడటానికి బలంగా ఉన్నప్పటికీ ప్రదర్శనలో లోటు కనిపిస్తోంది.