ఆసీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు సారథి కోహ్లీ దూరమవ్వడంపై స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్. విరాట్ జట్టులో లేకపోతే జట్టు బ్యాటింగ్ విభాగంపై అదనపు ఒత్తిడి పెరుగుతుందని చెప్పాడు. దీనితో పాటు బ్యాటింగ్ ఆర్డర్లోనూ స్పష్టత ఉండదని అన్నాడు.
"విరాట్ కోహ్లీ లేకపోతే టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతుంది. అతడి బ్యాటింగ్, నాయకత్వం లేకపోవడం ఆటగాళ్లపై భిన్నమైన ఒత్తిడి సృష్టిస్తుంది. ఒకవేళ రహానె సారథ్య బాధ్యతలు తీసుకుంటే.. అది అతడిపైనా అదనపు ఒత్తిడినే పెంచుతుంది. కీలకమైన నాలుగో స్థానంలో ఆడే కొత్త బ్యాట్స్‌మన్‌ను భారత యాజమాన్యం గుర్తించాలి. తొలి టెస్టు బ్యాటింగ్ ఆర్డర్ పైనే వారికి ఇంకా స్పష్టత లేదనుకుంటున్నా. ఎవరు ఓపెనింగ్ చేయాలి? కోహ్లీ అందుబాటులో లేకపోతే నాలుగో స్థానంలో ఎవరు ఆడతారు? వంటివి ఇంకా తెలియదు"
-పాంటింగ్, ఆసీస్ మాజీ సారథి.
జట్టు ఎంపిక పరంగా ఆసీస్ కన్నా టీమ్‌ఇండియాకే తలనొప్పులు ఎక్కువగా ఉన్నాయని అన్నాడు పాంటింగ్. పుకోవ్‌స్కీ, బర్న్స్, గ్రీన్ ఎంపికలోనే కంగారూలకు ఇబ్బంది ఉందన్నాడు. 'భారత్ జవాబులు వెతకాల్సిన ప్రశ్నలు ఎక్కువే ఉన్నాయి. షమి, బుమ్రా, ఇషాంత్, ఉమేశ్‌లో ఎవరిని ఆడిస్తారు? యువ పేసర్లు సైనీ, సిరాజ్ వీరిలో ఎవరిని తీసుకుంటారు? జట్టులో స్పిన్నర్లూ బాగానే ఉన్నారు. మరి వారిలో ఎవరిని ఎంచుకుంటారు? అడిలైడ్‌లో గులాబి టెస్టుకు ఎవరిని తీసుకుంటారు? అనేది తేల్చుకోవాల్సి ఉంది" అని పాంటింగ్ చెప్పాడు.
గత సిరీస్‌లో కోహ్లీసేన అద్భుతంగా ఆడిందన్నది వాస్తవమేనని అన్నాడు పాటింగ్. అయితే గతంలో వార్నర్, స్మిత్ లేకపోవడం వల్ల రెండు జట్ల మధ్య అంతరం ఎక్కువగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
మూడు వన్డేల సిరీస్‌తో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన ప్రారంభం కానుంది. నవంబరు 27, 29, డిసెంబరు 2 తేదీల్లో వన్డేలు, డిసెంబరు 4, 6, 8 తేదీల్లో టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత టెస్టులకు అడిలైడ్ (డిసెంబర్ 17-21), మెల్‌బోర్న్ (డిసెంబర్ 26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి.
ఇదీ చూడండి : వచ్చే ఐపీఎల్లో కప్ మాదే : రికీ పాంటింగ్