వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు షాకిచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో నిర్ణీత సమయంలో ఓవర్లు వేయకపోవడమే (స్లో ఓవర్‌రేట్) ఇందుకు కారణంగా తెలిపింది.
" భారత జట్టు నిర్దేశిత సమయంలో 20 ఓవర్లు వేయాల్సి ఉండగా 2 ఓవర్లు ఆలస్యంగా వేసింది. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున మొత్తం 40 శాతం జరిమానా విధించారు. ఫీల్డ్ అంపైర్లు క్రిస్‌బ్రౌన్, షాన్ హైగ్, మూడో అంపైర్ మెహోత్రా కోహ్లీసేనపై అభియోగాలు నమోదు చేశారు. సారథి విరాట్ కోహ్లీ తన పొరపాటును అంగీకరించడం వల్ల ఎలాంటి విచారణ ఉండదు"
-- ఐసీసీ ప్రకటన
నాలుగో టీ20 ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. మనీశ్ పాండే (50) అజేయ అర్ధశతకం సాధించాడు. లోకేశ్ రాహుల్ (39) ఫర్వాలేదనిపించాడు. ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌లో కొలిన్ మన్రో (64), టిమ్ సీఫెర్ట్ (57) దూకుడుగా ఆడటం వల్ల వారి విజయం ఖాయమే అనిపించింది. శార్దూల్ ఠాకూర్ వేసిన చివరి ఓవర్లో నలుగురు ఆటగాళ్లు ఔటవ్వడం వల్ల స్కోర్లు టై అయ్యాయి. సూపర్ ఓవర్లో రాహుల్, కోహ్లీ మెరుపులతో భారత్ విజయం అందుకుంది. ఫలితంగ ావరుసగా రెండు సూపర్ ఓవర్లలోనూ ఓటమిపాలైంది కివీస్ జట్టు.