విదేశీ టీ20 లీగ్‌ల్లో భారత ఆటగాళ్లు పాల్గొనడానికి బీసీసీఐ నుంచి అనుమతి లేదు. మిగిలిన దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లను ఫారెన్ లీగుల్లో ఆడటానికి అనుమతిస్తుండగా.. గాయాలు, అంతర్జాతీయ కట్టుబాట్ల కారణంగా వేరే లీగుల్లో ఆడటానికి మన క్రికెటర్లపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతి ఉంది. ఇప్పటికే యువరాజ్, ఇర్ఫాన్ పలు లీగ్‌ల్లో ఆడగా.. తాజాగా మునాఫ్ మైదానంలో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు.
సీపీఎల్‌లో ఇర్ఫాన్ పఠాన్
టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. గతంలో ఇతడు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో చోటు దక్కించుకున్నాడు. తాజాగా లంక ప్రిమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో ఆడనున్నాడు. కాండి టస్కర్స్ జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
టీమిండియా తరఫున 2012లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు ఇర్ఫాన్. ఆ తర్వాత జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. అదే విధంగా ఐపీఎల్లో 2017లో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం జరిగిన రెండు సీజన్లలోనూ ఏ ఫ్రాంఛైజీ ఇతడిని తీసుకోలేదు.
ఎల్పీఎల్లో మునాఫ్ పటేల్
నవంబరు 26 నుంచి ప్రారంభంకానున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో టీమ్ఇండియా మాజీ బౌలర్ మునాఫ్ పటేల్ పాల్గొననున్నాడు. టోర్నీలోని కాండి టస్కర్స్ జట్టులో ఆడేందుకు ఇటీవలే ఒప్పందపై సంతకం చేశాడు. 2011 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మునాఫ్.. మళ్లీ లంక ప్రీమియర్ లీగ్‌లో సందడి చేయనున్నాడు.
మునాఫ్ పటేల్.. 13 టెస్టులు, 70 వన్డేలు, మూడు టీ20ల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్ తరపున ఐపీఎల్లో మొత్తంగా 63 మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు.
బిగ్‌బాష్ లీగ్‌లో యువీ
ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గతంలో భాగమయ్యాడు. 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన యువీ.. ఐపీఎల్‌లోనూ ప్రాతినిధ్యం వహించడం లేదు. బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ ధ్రువీకరణపత్రం పొందిన తర్వాత 2019లో కెనడా వేదికగా జరిగిన గ్లోబల్ టీ20 లీగ్‌లో బరిలోకి దిగాడు. ఇందులో టొరంటో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనంతరం అబుదాబిలో జరిగే టీ10 మ్యాచ్‌ల్లోనూ సందడి చేశాడు.
సీపీఎల్, టీ10 లీగుల్లో ప్రవీణ్ తాంబే
2018లో అబుదాబి వేదికగా జరిగిన టీ10 లీగ్‌లో సింథిస్ తరఫున ఆడాడు తాంబే. ఇందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుమతి తీసుకోలేదు. ఐపీఎల్, భారత జట్టు తరఫున ఆడాలనుకునే ఏ క్రికెటర్ విదేశీ లీగుల్లో పాల్గొనకూడదనేది బోర్డు నిబంధన.
ఒకవేళ బయట దేశాల్లో ఆడాలనుకుంటే క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాలి. లేదంటే బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాల్సి ఉంటుంది. ఇవేమి చేయకుండా తాంబే నిబంధనలు ఉల్లంఘించాడని ఇతడిపై వేటు వేసింది బీసీసీఐ. ఫలితంగా ఐపీఎల్-2020లో ఆడే అవకాశం కోల్పోయాడు. అయితే ఈ ఏడాది జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టుకు ఎంపికయ్యాడు.