టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటోకు.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ హాస్యాస్పద కామెంట్ చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా టాస్ వేసే సమయంలో.. కోహ్లీ మైదానంలో ఒక విచిత్రమైన స్టెప్ వేశాడు. టీమిండియా బ్లేజర్ ధరించి రెండు చేతులను చాచి డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఆ ఫొటోను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా దానికి మంచి కామెంట్లు పెట్టమని అభిమానులను కోరింది బీసీసీఐ. ఉత్తమ కామెంట్లను అక్కడ పేర్కొంటామనీ చెప్పింది. అయితే విరాట్ ఫోజుపై శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తనదైన శైలిలో హాస్యాస్పద కామెంట్ చేశాడు.
![Indian Cricketer Shreyas Iyer posted comedy caption for Virat Kohli's photo shared by BCCI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6158827_kohli10.jpg)
"కాలి గజ్జెల మువ్వలు రాలిపోయాయా" అని శ్రేయస్ తన కామెంట్‌లో పేర్కొన్నాడు. ఎందుకంటే ఆ ఫొటోలో కోహ్లీ రెండు చేతులు చాచినట్లు కనిపిస్తుండగా.. వేళ్లు మాత్రం కిందకు వేలాడుతున్నట్లు ఉన్నాయి. అందుకే శ్రేయస్ అలా ఫన్నీగా స్పందించాడు.
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. తొలిరోజు మ్యాచ్ నిలిచిపోయేసరికి భారత్.. 55 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. రహానె 38*(122 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్ పంత్ 10*(37 బంతుల్లో 1ఫోర్) క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీషా(16), మయాంక్ అగర్వాల్(34), చెతేశ్వర్ పుజారా(11), విరాట్ కోహ్లీ(2), హనుమ విహారి(7) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 3 వికెట్లు తీయగా, టిమ్ సౌథీ, ట్రెంట్‌బౌల్ట్ చెరో వికెట్ తీశారు.