టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. పుణె వేదికగా లంకతో మూడో టీ20లో ఒక్క పరుగు వ్యక్తిగత స్కోరు వద్ద... కెప్టెన్‌గా 11 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనతను వేగవంతంగా సాధించిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 169 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా ఆరో క్రికెటర్‌గా నిలిచాడు. టీమిండియా తరఫున మహేంద్రసింగ్ ధోనీ ఒక్కడే ఇది వరకు ఈ రికార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 26 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు విరాట్.
కెప్టెన్‌గా 11 వేలు కన్నా ఎక్కువ అంతర్జాతీయ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్), ఎంఎస్ ధోని (భారత్), అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) కోహ్లీ కంటే ముందున్నారు.
పాంటింగ్ 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి15,440 పరుగులు చేయగా, గ్రేమ్ స్మిత్ 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు చేశాడు. ఫ్లెమింగ్ 303 మ్యాచ్‌ల్లో 11, 561 పరుగులు, ధోనీ 332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 11, 207 రన్స్ సాధించాడు.
ఆరో స్థానంలో...
అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్‌కు ప్రయోగాలు చేసే పనిలో ఉన్న కెప్టెన్ కోహ్లీ... గత మూడు సిరీస్‌ల్లో రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమైన సంజు శాంసన్, మనీశ్ పాండేలకు మూడో టీ20లో అవకాశం ఇచ్చాడు. యువకులకు ముందు వరుసలో బ్యాటింగ్‌కు అవకాశమిచ్చిన విరాట్... అనూహ్యంగా 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఇది అంతర్జాతీయ కెరీర్లో రెండోసారి. గతంలో ఐర్లాండ్‌పై ఈ స్థానంలో ఆడాడు.
మూడు టీ20ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది టీమిండియా. నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఓపెనర్లు ధావన్, కేఎల్ రాహుల్ అర్ధశతకాలతో రాణించగా.. భారత్ 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 201 స్కోరు చేసింది.