అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ల జాబితాలో అగ్రస్థానం కోసం విరాట్ కోహ్లీ-రోహిత్ మధ్య పోటీ కొనసాగుతోంది. ప్రస్తుతం కోహ్లీ రికార్డును అందుకోడానికి 7 పరుగుల దూరంలో ఉన్నాడు రోహిత్‌శర్మ. ఈ జాబితాలో కోహ్లీ(2,450) టాప్‌లో ఉండగా, రెండో స్థానంలో రోహిత్(2,443) ఉన్నాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టీ20లోనే రోహిత్ ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు కోహ్లీకి విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. అయితే కోహ్లీ 72 మ్యాచ్‌ల్లోనే అగ్రస్థానం కైవసం చేసుకోవడం విశేషం.
అర్ధశతకాల రికార్డు...
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లో ఉన్నాడు కోహ్లీ. ప్రస్తుతం 22 హాఫ్ సెంచరీలతో ముందంజలో ఉండగా, రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ నాలుగు సెంచరీలు, 17 అర్ధశతకాలు కలిపి మొత్తం 21సార్లు 50కి పైగా పరుగుల మార్కు అందుకున్నాడు. ఇంకో హాఫ్ సెంచరీ సాధిస్తే కోహ్లీ సరసన చేరతాడు రోహిత్. ఒకవేళ ఈ సిరీస్‌లో కనీసం రెండు హాఫ్ సెంచరీలు సాధిస్తే.. విరాట్ రికార్డు బ్రేక్ అవుతుంది.
ధోనీ రికార్డు బ్రేక్...
2007లో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు రోహిత్. దాదాపు 12 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. రేపటి మ్యాచ్‌లో ధోనీ(98) రికార్డును అధిగమించనున్నాడు. ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో షాహిద్ ఆఫ్రిది(99)తో కలిసి రెండో స్థానాన్ని పంచుకోనున్నాడు హిట్‌మ్యాన్. వీరిద్దరి కంటే ముందు షోయబ్ మాలిక్(111) మొదటి స్థానంలో ఉన్నాడు.