ఓ ప్రపంచకప్.. ఆ టోర్నీలో ఓ స్టార్ పర్ఫార్మర్. చివరికి ఫైనల్లో మాత్రం జట్టు ఓటమి. టీమ్ విజయం కోసం ఎంతో తపనపడి ఆడిన ఆటగాళ్లకు ఫలితం మాత్రం అనుకున్నట్లుగా రావట్లేదు.. జట్టు ఓడిపోవడం.. ఈ సన్నివేశాన్ని తట్టుకోవడం చాలా కష్టమే. సీనియర్ జట్టు ఆటగాడు రోహిత్ శర్మ, అండర్-19 ఆటగాడు యశస్వి జైస్వాల్, మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ ఈ కోవాకే చెందుతారు. అలా ఇలాంటి ఓ సంఘటన చూడటం టీమిండియా అభిమానులకు ఇది మూడోసారి.
రోహిత్ శర్మ- 2019 ప్రపంచకప్
రోహిత్ శర్మ.. 2019 ప్రపంచకప్‌లో మార్మోగిన పేరు. 81 సగటుతో 648 పరుగులు చేసి సత్తాచాటాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండటం విశేషం. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడిన భారత్ పోరాడి ఓడడం వల్ల రోహిత్ శ్రమ ఓ రకంగా వృథా అయిందనే చెప్పాలి. ఈ మ్యాచ్ పరాజయం తర్వాత రోహిత్ కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానుల కంట నీళ్లు తెప్పించింది.
యశస్వి జైస్వాల్ - 2020 అండర్-19 ప్రపంచకప్
దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఫైనల్‌కు చేరారు. కానీ తుదిపోరులో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ టోర్నీలో భారత యువకెరటం యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. మొత్తం 400 పరుగులతో మెరిసిన యశస్వి ఫైనల్లోనూ 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. ఓటమి అనంతరం ఇతడు కన్నీరు పెట్టుకోవడం అభిమానుల హృదయాలను కలచివేసింది.
షెఫాలీ వర్మ- మహిళా టీ20 ప్రపంచకప్
మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గ్రూపు స్టేజీలో సత్తాచాటింది. ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సెమీస్ వర్షం కారణంగా రద్దవడం వల్ల ఫైనల్‌కు అర్హత సాధించింది. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో చతికిలపడింది. ఈ టోర్నీలో ఆద్యంతం విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో సత్తాచాటిన షెఫాలీ వర్మ (2).. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం విఫలమైంది. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా నిరాశపర్చడం వల్ల భారత్ ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం షెఫాలీ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.