కొత్త ఏడాదిలో కీలక సమరానికి సిద్ధమైంది టీమిండియా. ఆస్ట్రేలియాతో తాడో పేడో తేల్చుకోనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు(ఆదివారం).. బెంగళూరులో నిర్ణయాత్మక మ్యాచ్ ఆడనుంది. మరి ఇరుజట్లలో ఎవరు గెలుస్తారో చూడాలి?
ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి భారత్-ఆస్ట్రేలియా ఊపుమీదున్నాయి. గతేడాది వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన చూస్తుండగా, సిరీస్ పట్టేయాలని చూస్తోంది ఆసీస్. రెండు పటిష్ఠ జట్ల మధ్య ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ భారత్‌కు మరోసారి ప్రధాన బలంగా మారనుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ శుభారంభం అందివ్వాలని టీమిండియా కోరుకుంటోంది. అయితే వీరిద్దరూ రెండో వన్డేలో గాయపడటం వల్ల ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
భారత టాపార్డర్ బలంగా ఉంది. శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, జడేజా అంచనాల మేరకు రాణిస్తే బ్యాటింగ్‌లో తిరుగుండదు. ఏ స్థానంలోనైనా రాణిస్తున్న కేఎల్ రాహుల్.. మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. గత వన్డేలోని బ్యాటింగ్ ఆర్డర్‌నే.. ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించే అవకాశముంది.
టీమిండియా బౌలర్లందరూ సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. వారు ట్రాక్‌లోకి వస్తే ఆసీస్‌ను కట్టడి చేయడం కష్టమేమీ కాదన్న భావనలో కోహ్లీసేన ఉంది. రెండు వన్డేల్లోలాగా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగొచ్చు.
ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్థాయికి తగ్గట్లు రాణిస్తోంది. తొలి వన్డేలో సాధికార విజయం సాధించింది. రెండో వన్డేలోనూ గెలుపు కోసం పోరాడింది. మూడో వన్డేలో భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, గెలిచి సిరీస్‌ను పట్టేయాలని ఫించ్‌సేన పట్టుదలగా ఉంది. బౌలింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దుకొని, ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించాలని కంగారూలు భావిస్తున్నారు.