ధోనీ ఇచ్చిన సలహాలు చాలా సార్లు పనిచేయలేదని కుల్దీప్ అన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అది కాస్తా ధోనీ అభిమానులకు కోపం తెప్పించింది. విమర్శలు ఎక్కువ కావటం మూలంగా కుల్దీప్ ఎట్టకేలకు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నాడు.
"ఆట మధ్యలో ధోనీ ఎక్కువగా మాట్లాడడు. అవసరం ఉందనుకుంటే ఓవర్ల మధ్యలో మాట్లాడతాడు" అని చెప్పిన మాటలను మీడియా వ్యతిరేక అర్థంలో తీసుకుందని అభిప్రాయపడ్డాడు కుల్దీప్.
" ఎటువంటి కారణం లేకుండా మీడియా మరో వివాదం సృష్టించింది. ధోనీకి వ్యతిరేకంగా విమర్శలు చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఇలాంటి విషయాలతో లాభం పొందాలని చూసిన కొందరు ఇలా చేశారు. నేను ఎవరి మీద అనవసర వ్యాఖ్యలు చేయలేదు. మహీభాయ్ అంటే నాకు గౌరవముంది".
--కుల్దీప్ యాదవ్, భారత బౌలర్
మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది టీమిండియా.
మే30 నుంచి ప్రారంభం కానున్న 2019 వన్డే ప్రపంచకప్‌లో ధోనీ కీలక ఆటగాడు. విరాట్ సారథ్యంలో 15 మంది బృందంలో కుల్దీప్ ఒకడు. ఈ 24 ఏళ్ల యువ ఆటగాడు ఇంగ్లండ్‌లో 3 వన్డేలు మాత్రమే ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు. వాటిలో 6/25 అత్యత్తమం నమోదు చేశాడు. భారత్ తన తొలి మ్యాచ్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.