క్రికెట్ అభిమానులకు మరో చేదు వార్త! బెంగళూరు వేదికగా ఆదివారం జరగనున్న భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20 పోరుకు వర్షం ఆటంకం కలిగించే అవకాశముంది. ఈ విషయాన్ని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఆదివారం కర్ణాటక సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు దాదాపు 40% ఉన్నాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది.
మొహాలీలో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్లో గెలిచిన కోహ్లీసేన... సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై స్వదేశంలో టీమిండియా టీ20 సిరీస్‌ను గెలవలేదు. మూడో టీ20లో గెలిస్తే ఈ రికార్డు బ్రేక్ కానుంది.