పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనింగ్ జోడీ శుభారంభం అందించింది. మొదటి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను బెన్ స్టోక్స్ విడగొట్టాడు. 16వ ఓవర్ తొలి బంతికే రోహిత్ శర్మ(42 బంతుల్లో 28) కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఫామ్‌లోకి గబ్బర్.. హాఫ్ సెంచరీతో విరాట్..
మరో డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్(106 బంతుల్లో 98)తో జట్టు కట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(60 బంతుల్లో 56) రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. మంచి ఇన్నింగ్స్‌తో శతకం దిశగా సాగుతున్న కోహ్లీని మార్క్ వుడ్ దెబ్బకొట్టాడు. అనవసర షాట్‌కు పోయిన విరాట్.. బౌండరీ వద్ద మొయిన్‌కు చిక్కాడు. కొద్దికాలంగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న గబ్బర్ ఎట్టకేలకు మంచి టచ్‌లో కనిపించాడు. సెంచరీ చేసే క్రమంలో ఒత్తిడికి లోనైన ధావన్.. స్టోక్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవీలియన్‌కు చేరాడు.
ఇదీ చదవండి: ఎట్టకేలకు ఫామ్ అందుకున్న గబ్బర్
దంచికొట్టిన రాహుల్-కృనాల్..
శ్రేయస్ అయ్యర్(6), హార్దిక్ పాండ్య(1) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో భారత్ కనీసం 250 పరుగులైన చేస్తుందా? అన్న సందేహం తలెత్తింది. 40.3 ఓవర్లో 205 వద్ద హార్దిక్ వికెట్ కోల్పోయిన టీమ్ఇండియా.. చివరికి 300 పరుగులు దాటిందంటే అది రాహుల్-కృనాల్ జోడీ వల్లే అని చెప్పాలి. టీ20ల్లో వరుస వైఫల్యాలను చూసిన రాహుల్.. ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. ఇద్దరూ చూడచక్కనైనా షాట్లతో అలరించారు. ఆరో వికెట్‌కు ఈ జంట 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. మైదానం నలువైపులా షాట్లు కొట్టిన ఈ జంట స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఇరువురు అర్ధ సెంచరీలు చేసి అజేయంగా నిలిచారు. చివరి పది ఓవర్లలో భారత్ 100కు పైగా రన్స్ సాధించింది.
కృనాల్ అదరహో..
అరంగేట్రం ఆటగాడు కృనాల్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో కేవలం 31 బంతుల్లోనే 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన కృనాల్.. ఈ ఇన్నింగ్స్‌ను తన తండ్రికి అంకితమిచ్చాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించాడు పాండ్య.
ఇదీ చదవండి: కోహ్లీ.. ఇంకెన్నాళ్లు ఈ నిరీక్షణ!