భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న మొతేరా పిచ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు జరిగిన చెన్నైలోని చెపాక్ మైదానం సహజంగానే స్పిన్‌కు స్వర్గధామం. తొలి టెస్టులో ఫ్లాట్ వికెట్‌పై కీలకమైన టాస్‌ను ఇంగ్లాండ్ గెలవడం వల్ల ఆ జట్టు పైచేయి సాధించగలిగింది. దానికి బదులు తీర్చుకునేందుకు రెండో టెస్టు కోసం మరింత స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ను తయారు చేశారు. తొలి రోజు నుంచే బంతి తిరిగిన ఆ పిచ్‌పై విమర్శలు కూడా వచ్చాయి. భారత్‌కు పూర్తి అనుకూలమైన పిచ్ రూపొందించారంటూ విదేశీ మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పుడు మూడో టెస్టు జరిగే మొతేరా మైదానం చరిత్ర చూస్తే అది సహజంగా స్పిన్నర్లకు సహకరిస్తుంది. కానీ ఇప్పుడు గులాబి బంతితో మ్యాచ్ జరగనుంది కాబట్టి పిచ్‌పై మరింత పచ్చిక పెంచాల్సిన అవసరం ఉంటుంది. పైగా 2012 తర్వాత ఈ మైదానంలో తిరిగి ఇప్పుడే టెస్టు జరగనుంది. స్టేడియాన్ని పునఃనిర్మించిన నేపథ్యంలో పిచ్‌లనూ కొత్తగా రూపొందించారు. ఈ పరిస్థితుల్లో ఆ కొత్త పిచ్ ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది.
డేనైట్ అయితే..
పగటి పూట జరిగే టెస్టులతో పోలిస్తే డేనైట్ మ్యాచ్‌ల కోసం ఉపయోగించే పిచ్‌లను పచ్చికతో నింపేస్తారు. గులాబి బంతిపై మెరుపు ఎక్కువ సేపు ఉండడం కోసం పిచ్‌పై ఆరు సెంటీమీటర్ల పొడవుతో గడ్డి ఉండేలా చూస్తారు. అదనపు కోటింగ్ ఉండే గులాబి బంతికి ఈ పచ్చిక కూడా తోడవడం వల్ల అది ఎక్కువగా స్వింగ్, సీమ్ అవుతుంది. దీంతో పేసర్లు అధిక ప్రభావం చూపగలరు. కాబట్టి మూడో టెస్టులో పిచ్ పచ్చికతో కళకళలాడొచ్చు. అయితే మరీ ఎక్కువగా పేస్‌కు సహకరించేలా తయారుచేస్తే.. మంచి ఫాస్ట్‌బౌలింగ్ దళం కలిగిన ఇంగ్లాండ్‌కు ప్రయోజనం చేకూరొచ్చు. భారత్‌కు కూడా మంచి పేస్ బలం ఉన్నప్పటికీ.. ప్రత్యర్థి కాస్త మెరుగ్గా కనిపిస్తోంది.
సంప్రదాయంగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ను అలాగే కొనసాగిస్తూ మరోసారి మన స్పిన్నర్లకు బలం చేకూర్చే అవకాశం కలిగిస్తే.. ఇప్పటికే స్పిన్ పిచ్‌లు తయారు చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలు మరింత ఎక్కువవుతాయి. డేనైట్ టెస్టుకు కూడా స్పిన్ పిచ్ తయారు చేస్తే అందుకు టీమ్‌ఇండియా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గులాబి బంతి మ్యాచ్ కోసం పేస్ పిచ్‌నే సిద్ధం చేయొచ్చు. కానీ అది అధికంగా పేస్‌కు సహకరిస్తే ప్రమాదమని భావించి.. సాధారణ స్థాయిలోనే పిచ్‌ను సిద్ధం చేస్తారేమో చూడాలి.
ఇదీ చూడండి: లంబూకు 100వ మ్యాచ్- 400 వికెట్లకు చేరువలో యాష్