భారత్ వర్సెస్ పాక్.. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ సంగ్రామం అంటే ఎక్కడా లేని ఆసక్తి. ఇరు దేశాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా దాయాది జట్ల పోరు అంటే ప్రత్యేకమే. మైదానంలో అంతలా తలపడతాయి ఇరు జట్లు.
అభిమానులతో పాటు... ఆటగాళ్లూ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కదన రంగంలోకి దిగుతారు. ఎలాగైనా మ్యాచ్ గెలవాలని ఊవిళ్లూరుతుంటారు. దాయాదిపై వ్యక్తిగతంగా శాయశక్తులా ప్రదర్శన చేయాలని ప్రతి ఆటగాడూ కోరుకుంటాడు.
అందుకే ప్రపంచ క్రికెట్ అభిమానులకు మరోసారి అసలు సిసలైన మజాను రుచిచూపించడానికి సిద్ధమవుతున్నాయి ఈ ఉపఖండ జట్లు. మెగా టోర్నీలో హోరాహోరీ పోరు కోసం నేడు రంగంలోకి దిగుతున్నాయి. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ప్రపంచకప్ టోర్నీల్లో తిరుగులేని భారత్...
భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడక 6 సంవత్సరాలు దాటింది. చివరిసారిగా 2012-13లో భారత్‌లో పర్యటించింది పాక్. అనంతరం భారత్ పాక్‌కు గాని.. పాకిస్థాన్ భారత్‌కు గానీ.. క్రికెట్ కోసం రాలేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడ్డాయి ఇరు జట్లు. అయితే.. అందులోనూ పూర్తి ఆధిపత్యం టీమిండియాదే. పాకిస్థాన్ ఇప్పటివరకు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌పై గెలిచిందే లేదు. వన్డే ప్రపంచకప్‌లో ముఖాముఖి 6 సార్లు తలపడగా.. అన్ని సార్లు భారత్‌దే విజయం.
ప్రపంచకప్‌లో ఇరు జట్లు...
ప్రపంచ కప్ | ఫలితం | మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ |
1992 | 43 పరుగుల తేడాతో భారత్ గెలుపు | సచిన్ తెందుల్కర్ |
1996 | 39 పరుగుల తేడాతో భారత్ గెలుపు | నవ్‌జోత్ సిద్ధూ |
1999 | 47 పరుగుల తేడాతో టీమిండియా విజయం | వెంకటేశ్ ప్రసాద్ |
2003 | 6 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు | సచిన్ తెందుల్కర్ |
2011 | 29 పరుగుల తేడాతో భారత్ విజయం | సచిన్ తెందుల్కర్ |
2015 | 76 పరుగులు తేడాతో భారత్‌దే మ్యాచ్ | విరాట్ కోహ్లీ |
ఇప్పుడు ఏడో సారి బరిలోకి దిగుతున్నాయి భారత్, పాక్ జట్లు. గెలుపు రుచి కోసం పాకిస్థాన్... మళ్లీ దెబ్బకొట్టేందుకు భారత్ మ్యాచ్ ఆడనున్నాయి. అభిమానులూ రసవత్తర పోరును కోరుకుంటున్నారు.
ఒకే గెలుపుతో పాక్.. ఓటమి లేని భారత్
ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీని అద్భుతంగా ప్రారంభించింది టీమిండియా. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై, తర్వాత ఆస్ట్రేలియాపై అలవోక విజయాలు సాధించింది. హోరాహోరీగా సాగుతుందని ఊహించిన కివీస్‌తో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది.
2019 ప్రపంచకప్- భారత్ ప్రదర్శన..
- దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపు
- ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో విజయం
- న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
పాయింట్ల పట్టికలో భారత్‌ది పైనుంచి నాలుగో స్థానమైతే.. పాక్‌ది కిందినుంచి రెండో ర్యాంకు. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి 5 పాయింట్లతో ఉంది కోహ్లీ సేన.
పాక్.. 4 మ్యాచ్‌లాడి ఒకే విజయం సాధించింది. 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.
2019 ప్రపంచకప్- పాక్ ప్రదర్శన
- వెస్టిండీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి
- ఇంగ్లాండ్‌పై 14 పరుగుల తేడాతో గెలుపు
- శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
- ఆస్ట్రేలియా చేతిలో 41 పరుగుల తేడాతో పరాజయం
అందరూ ఫామ్‌లోనే...
టీమిండియాలో అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ధావన్ లేని లోటు మ్యాచ్‌పై కచ్చితంగా ఉంటుంది. ఆస్ట్రేలియాపై సెంచరీతో విజయం సులువు చేశాడు గబ్బర్. వేలి గాయం కారణంగా దాదాపు 3 మ్యాచ్‌లకు దూరమయ్యాడు శిఖర్.
ధావన్ లోటుతో ఓపెనింగ్‌లో రాహుల్ ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. రోహిత్ మంచి ప్రదర్శనలు చేస్తున్నాడు. 2 మ్యాచ్‌లలో 179 పరుగులు చేశాడు. మూడో స్థానంలో కోహ్లీ ఉండనే ఉన్నాడు. నాలుగో స్థానంలో దినేష్ కార్తీక్, విజయ్ శంకర్లలో ఎవరిని తీసుకుంటారో స్పష్టత లేదు. మిడిలార్డర్ ధోని, జాదవ్, పాండ్యలతో పటిష్ఠంగా ఉంది. ముఖ్యంగా ధోని, పాండ్య దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచుతున్నారు.
భారత బౌలింగ్ దళం బలంగా ఉంది. బుమ్రా, భువనేశ్వర్, పాండ్య పేస్ విభాగాన్ని పంచుకోనున్నారు. స్పిన్నర్లలో చాహల్ ఆకట్టుకుంటున్నాడు. భారీగా పరుగులిస్తున్న కుల్దీప్ స్థానంలో షమి వచ్చే అవకాశముంది. దాయాదిపై మ్యాచ్‌లో వీరంతా సమష్టిగా రాణిస్తే విజయం తేలికే అవ్వొచ్చు.
నిలకడలేమితో పాక్...
అనిశ్చితికి మారు పేరైన పాక్.. ఎప్పుడెలా ఆడుతుందో చెప్పడం కష్టం. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకోవాలన్నా.. కష్టమనుకున్న దశలో అనూహ్యంగా గెలవాలన్నా పాక్‌కే చెల్లుతుంది. అయితే.. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్‌పై గెలవని పాకిస్థాన్.. ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో..
- ఆ జట్టులో ఎన్నో అంచనాలున్న ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోతున్నారు. ఓపెనర్లు ఇమాముల్ హక్, ఫకర్ జమాన్ మంచి భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోతున్నారు. మిడిలార్డర్లో బాబార్ అజామ్, హఫీజ్‌లు నిలకడగా ఆడుతున్నారు. హఫీజ్ పాక్ తరఫున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. వీరిద్దరూ ఆడితే పాక్ భారీ స్కోరు చేయొచ్చు.
- బౌలింగ్‌లో ఆమిర్ చెలరేగిపోతున్నాడు. ఆలస్యంగా ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన ఈ యువపేసర్ నిప్పులు చెరిగే బంతులతో హడలెత్తిస్తున్నాడు. 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు వాహబ్ రియాజ్, షాహీన్ అఫ్రిదీల నుంచి ఆమిర్‌కు సరైన సహకారం లభించట్లేదు.
తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 105 పరుగులకే కుప్పకూలిన పాక్... తన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య బలమైన ఇంగ్లాండ్‌పై 348 పరుగుల భారీ స్కోరు చేసి గెలిచింది. అనంతరం ఆసీస్‌తో పోరాడి ఓడింది.
తనదైన రోజునా ఎంతటి జట్టునైనా ఓడించగలిగిన పాక్... భారత్‌తో మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనన్నది ఆసక్తికరంగా మారింది. మరోసారి ఈ ప్రపంచకప్ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన కోహ్లీసేన పాక్‌పై అదే ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.