టీమ్ఇండియాలో ప్రస్తుతం కుర్రాళ్లు అదరగొడుతున్నారు. మ్యాచ్ విజయాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీయగా, కృనాల్ పాండ్య అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో వీరిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
పాక్ దిగ్గజ ఆటగాడు ఇంజిమామ్ ఉల్ హక్ కూడా భారత జట్టు ప్రస్తుత ప్రదర్శనపై పొగడ్తలు కురిపించాడు. యువ ఆటగాళ్లను టీమ్ఇండియా తీర్చిదిద్దుతున్న విధానం తనను ఆకట్టుకుందని చెప్పాడు.
"జట్టులోకి వచ్చే యువ క్రికెటర్ల కోసం టీమ్ఇండియా ఓ మెషీన్ దగ్గరపెట్టుకున్నట్లు ఉంది. తొలి వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్యల ప్రదర్శనే ఇందుకు ఉదాహరణ. ఈ ఆటతో సీనియర్లు తమ స్థానాన్ని కాపాడుకోవాలని కుర్రాళ్లు సూచన ఇస్తున్నట్లు కనిపిస్తోంది" అని ఇంజిమామ్ అన్నాడు.
"గతేడాది చివర్లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటన నుంచి భారత జట్టును గమనిస్తున్నాను. ప్రతి మ్యాచ్/ఫార్మాట్లో ఓ యువ ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. గత ఆరు నెలల్లో టీమ్ఇండియా అద్భుతంగా ఆడుతుందంటే దానికి కారణం కుర్రాళ్లే" అని ఇంజిమామ్ చెప్పాడు.
పుణె వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో కోహ్లీసేన 66 పరుగుల తేడాతో గెలిచింది. రెండో వన్డే శుక్రవారం జరగనుంది.