ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 360 పాయింట్లతో టాపర్‌గా ఉంది. బుధవారం ఈ మేరకు ర్యాంక్‌లను విడుదల చేసింది ఐసీసీ.
ముందుకొచ్చిన ఇంగ్లాండ్..
ఈ జాబితాలో ఆస్ట్రేలియా.. 296 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలిచిన ఇంగ్లాండ్.. 292 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా కంటే ఇంగ్లీష్ జట్టు కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది.
180 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో ర్యాంక్‌లో ఉంది. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో తేలిపోయిన పాకిస్థాన్.. 166 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ ఒక మ్యాచ్‌లో ఓడి.. రెండింటిని డ్రాతో సరిపెట్టుకుంది. ఇక శ్రీలంక (80), వెస్టిండీస్ (40), దక్షిణాఫ్రికా (24), బంగ్లాదేశ్ (0)లు టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో వరుసగా ఉన్నాయి.
భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ కలిపి మొత్తం తొమ్మిది దేశాలు ఈ టోర్నీలో పోటీపడుతున్నాయి.
27 సిరీస్‌ల్లో 71 టెస్టులు:
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ప్రతి జట్టు సొంతగడ్డపై మూడు, విదేశీ గడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. 2019, ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ని ఐసీసీ ప్రారంభించింది. రెండేళ్ల ఈ ఛాంపియన్‌షిప్‌లో చివరగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్ నెలలో ఫైనల్ జరగనుంది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్‌గా నిలవనుంది.