క్వీన్స్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో 59 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన వన్డే కెరీర్లో 42వ సెంచరీ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అనంతరం స్పందిస్తూ.. ఓపెనర్లు పెవిలియన్ చేరాక తను బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందన్నాడు.
"270 పరుగులు ప్రత్యర్థికి సవాలు విసిరే స్కోరే. ఓపెనర్లు రోహిత్ శర్మ(18), శిఖర్ ధావన్(2) ఔటయ్యాక జట్టును నడిపే బాధ్యత నాపై పడింది. టాప్ ఆర్డర్లో ఉన్న ముగ్గురిలో ఎవరో ఒకరు ఆ అవకాశం తీసుకోవాలి. ఈ మ్యాచ్‌లో నేను తీసుకున్నా. సెంచరీ చేయడం ఆనందంగా ఉంది." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం మంచిదైందని చెప్పాడు కోహ్లీ. వర్షం పడుతూ ఆగుతూ ఉండటం వల్ల పిచ్ ప్రమాదకరంగా తయారైందని అన్నాడు. ప్రత్యర్థి జట్టులో ఎడం చేతి వాటం బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉండటం వల్ల కుల్దీప్ను తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. తను ఔటయ్యాక కీలక సమయంలో 71 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్‌ను ప్రశంసించాడు కోహ్లీ.
ఇదే మ్యాచ్‌లో పలు రికార్డులు తన పేరిట నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్, ఓ జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్(34)ల్లో 2000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో గంగూలీ(11,363)ని అధిగమించిన రెండో స్థానానికి ఎగబాకాడు విరాట్(11,406). తొలి స్థానంలో సచిన్ తెందూల్కర్(18,426) ఉన్నాడు.
ఇదీ చూడండి: రోజర్స్ కప్ విజేత రఫా.. ఖాతాలో 35వ టైటిల్