భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవ హోదాలో ఉన్న ధోనీ.. మరో అరుదైన అవకాశం పొందనున్నాడు. కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్‌లో సైన్యంలో విధులు నిర్వర్తిస్తోన్న మహీ... త్వరలో లద్దాఖ్‌లో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నాడు. ఆగస్ట్ 15న జెండావందనం రోజు మహీకి ఈ అవకాశం దక్కనుంది. అయితే ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

గ్రామాల్లో రెపరెపలే...
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసి, కశ్మీర్, లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది భారత ప్రభుత్వం. ఇప్పటివరకు ఆ ప్రాంతాల్లో ప్రత్యేక జెండా ఉండేది. ఆగస్ట్ 15న ప్రతి గ్రామంలో భారత జెండా ఎగురవేయాలని నిర్ణయించింది మోదీ ప్రభుత్వం.
అదృష్టమే...
ప్రపంచకప్‌లో సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత ధోనీ రిటైర్మెంటుపై విపరీతంగా చర్చ జరిగింది. ఆ సమయంలో అనూహ్యంగా రెండు నెలలు ఆటకు విరామం ప్రకటించాడీ 38 ఏళ్ల వికెట్ కీపర్. అనంతరం జులై 30న టెరిటోరియల్ ఆర్మీలో చేరిన మిస్టర్ కూల్... దక్షిణ కశ్మీర్లో ప్రస్తుతం విధుల్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఆగస్ట్ 10న తన బృందంతో లద్దాఖ్‌లోని లేహ్‌కు పయనమవనున్నాడు. ఒకవేళ లద్దాఖ్‌లోనే స్వాతంత్ర్య దినోత్సవం వరకు ఉంటే ఆ ప్రాంతంలోనే త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నాడు.

ప్రస్తుతం భారత సైన్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు ధోనీ. గౌరవ హోదాలో ఉన్న అతడు ప్రత్యేక వసతులు కోరుకోకుండా... యూనిట్‌లోని సభ్యులతో సాధారణంగా ఉంటున్నాడు. జవాన్లకు ప్రేరణ కల్పించడం, శిక్షణ తరగతుల నిర్వహణ, పహారా వంటి విధులు నిర్వర్తిస్తున్నాడు. తోటి జవాన్లతో కలిసి వారితో పాటే బ్యారాక్‌ల్లోనే ఉంటూ కలిసి తినడం, కలిసి ఆడిన ఫొటోలు ఇటీవల నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఆగస్ట్ 15 వరకు ఈ బాధ్యతల్లోనే ఉండనున్నాడు మహీ.

ఇవీ చూడండి...