సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన టీమ్ఇండియా.. టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో గెలుపొందింది. అద్భుతమైన గెలుపుతో టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఈ సిరీస్ విజయంతో కోహ్లీ సేన పలు రికార్డులు నమోదు చేసింది. అవేంటో మీరూ చూడండి.
- తాజా సిరీస్ విజయంతో టీమ్ఇండియా వరుసగా ఆరు టీ20 సిరీస్‌లు కైవసం చేసుకుంది. 2019లో బంగ్లాపై ప్రారంభమైన విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.
- మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధికంగా 16 మంది ప్లేయర్లను పరిశీలించింది భారత్. ఓ సిరీస్‌లో అత్యధిక ఆటగాళ్లను బరిలోకి దింపడం ఇదే తొలిసారి.
- 64 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ.. మొత్తం 2,864 పరుగులతో ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్తిల్ (2839 పరుగులు)ను అధిగమించాడు హిట్‌మ్యాన్. విరాట్ కోహ్లీ (3159 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు.
- టీ20ల్లోని ఓ ఇన్నింగ్స్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు.. ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్(10) తొలి స్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ (9), కోలిన్ మున్రో (9) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చదవండి: అత్యధిక టీ20 పరుగుల జాబితాలో రోహిత్@2
- చివరి మ్యాచ్‌లో 80 పరుగులతో అజేయంగా నిలిచిన విరాట్ మరో రికార్డు సాధించాడు. ఓ ఇన్నింగ్స్‌లో 80, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ(7) రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ లిస్టులో రోహిత్ (9) తొలి స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ (6), మార్టిన్ గప్తిల్ (6) విరాట్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
- పొట్టి ఫార్మాట్లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ మలన్ కొత్త ఫీట్ సాధించాడు. మలన్ 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును చేరుకున్నాడు. విరాట్ కోహ్లీకి 26 ఇన్నింగ్స్‌లు పట్టింది. పాక్ క్రికెటర్ బాబర్ అజామ్ 27 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
- ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ తాజాగా స్థానం సంపాదించాడు. ఈ లిస్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ (21741) తొలి స్థానంలో ఉన్నాడు. 13వేల పరుగులతో విరాట్ ఆరో స్థానంలో నిలిచాడు.
ఇదీ చదవండి: 'కింగ్' కోహ్లీ ఖాతాలో మరిన్ని రికార్డులు