వన్డే క్రికెట్‌లో ప్రపంచ నంబర్ 1, నంబర్ 2 జట్ల మధ్య ఆసక్తికర పోరు.. పుణె వేదికగా మంగళవారం నుంచి మొదలుకానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈనెల 23, 26, 28న ఇరు జట్లు పోటీపడనున్నాయి. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లను గెలుచుకున్న భారత్.. పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో ఈ వన్డే సిరీస్‌ను కూడా సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ పట్ల జట్టు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. తొలి టీ20లో విఫలమైన అనంతరం ధావన్ జట్టులో చోటు కోల్పోయాడు. యువకులతో భారత రిజర్వు బెంచ్ పటిష్టంగా ఉంది. దీంతో 35ఏళ్ల ధావన్ చోటు నిలుపుకోవాలంటే తప్పక రాణించాల్సిన పరిస్థితి నెలకొంది. వన్డే జట్టుకు ఎంపికైన శుభ్‌మన్ గిల్.. విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్ ఓపెనింగ్ స్థానం కోసం పోటీలో ఉన్నారు.
ఓపెనింగ్ రోహిత్-ధావన్ జోడీనే..
మంగళవారం జరిగే వన్డేలో రోహిత్‌తో కలిసి ధావన్ ఓపెనింగ్ చేస్తాడని సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీ20లతో పోలిస్తే బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకోవడానికి వన్డేల్లో ఎక్కువ సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో తన అనుభవాన్ని ఉపయోగించి ఈ దిల్లీ బ్యాట్స్‌మెన్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ ద్వారా అక్టోబర్‌లో స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తుదిజట్టుపై భారత్ ఓ అంచనాకు వచ్చే వీలుంది.
టీ20 సిరీస్ ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఐతే 2019 ఆగస్టులో వెస్టిండీస్‌పై శతకం చేసిన కోహ్లీ.. మళ్లీ మూడంకెల మార్కు అందుకోలేదు. ఈ సిరీస్ ద్వారా ఆ లోటును పూర్తిచేయాలని విరాట్ భావిస్తున్నాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్‌లో కీలకం కానున్నారు. ఒక స్థానం కోసం మాత్రం శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ మధ్య పోటీ నెలకొంది.
భువీ నడిపించాలి..
భువనేశ్వర్ కుమార్ పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించనున్నాడు. శార్దుల్ ఠాకూర్, నటరాజన్, మహమ్మద్ సిరాజ్‌తో పాటు విజయ్ హజారే ట్రోఫీలో 14 వికెట్లతో రాణించి.. టీమిండియాకు ఎంపికైన పేసర్ ప్రసిధ్ కృష్ణపై అందరి దృష్టి నెలకొంది. స్పిన్నర్లలో కృనాల్ పాండ్యా, కుల్దీప్‌లు మాత్రమే కాకుండా యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ తుదిజట్టులో ఉండే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా ఐదో బౌలర్ పాత్ర పోషించనున్నాడు.
పరువు కోసం ఇంగ్లాండ్..
ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్.. వన్డే సిరీస్‌లో విజయం సాధించి పర్యటనను ముగించాలని కోరుకుంటోంది. కెప్టెన్ మోర్గాన్ రాణించడంపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. జోస్ బట్లర్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్ రాణించాలని ఇంగ్లాండ్ కోరుకుంటోంది. మోచేతి గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ సిరీస్‌కు దూరం అయ్యాడు. దీంతో మార్క్ వుడ్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు.
మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌ల స్పిన్ ద్వయం ఈ పర్యటనలో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో ఆశించిన మేర విజయం సాధించలేదు. బౌలర్లందరూ సమష్టిగా రాణించాలని ఇంగ్లాండ్ కోరుకుంటోంది. పుణెలోని ఎంసీఏ మైదానంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి వన్డే మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు ప్రారంభం కానుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: ఆసీస్‌తో చారిత్రక టెస్టు సిరీస్ విజయానికి 20 ఏళ్లు