మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఐదోసారి విజేతగా నిలిచింది. జట్టు సమష్టిగా రాణించడం వల్ల ఆసీస్ 85 పరుగుల తేడాతో గెలిచింది. కంగారూ జట్టు ఇచ్చిన 185 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 99 రన్స్‌కే పరిమితమైంది మహిళా టీమిండియా.
షెఫాలీ నిరాశ..
భారీ ఛేదనలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షెఫాలీ(2) టోర్నీలో తొలిసారి నిరాశపర్చింది. స్మృతి మంధాన(11), రోడ్రిగ్స్(0), హర్మన్‌ప్రీత్ కౌర్(4) పేలవ ఆటతీరు ప్రదర్శించారు. దీప్తి(33), వేద(19), రిచా(18) కాసేపు పోరాడినా ఫలితం లేదు. మేగన్ షూట్ 4, జొనాసెన్ 3 వికెట్లు సాధించారు.
ఆసీస్ ఓపెనర్లు బాదేశారు..
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. అలీసా హేలీ 75(39 బంతుల్లో 7ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్ మూనీ 78*(54 బంతుల్లో 10 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. వీరద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించి భారత బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం వహించారు. శతకం వైపు దూసుకుపోతున్న హేలీని 12వ ఓవర్‌లో రాధా యాదవ్ బోల్తాకొట్టించింది. ఊరించే బంతి వేయడంతో హేలి భారీ షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద వేదా కృష్ణమూర్తి చేతికి చిక్కింది. అప్పటికే భారత్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆ తర్వాత కెప్టెన్ మెగ్ లానింగ్ (16) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా శిఖా పాండే బౌలింగ్‌లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. అదే ఓవర్‌లో ఆష్లీ గార్డ్‌నర్ (2) స్టంపౌటవ్వడం వల్ల ఆసీస్ 156 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. చివర్లో పూనమ్.. రేచల్(4)ను బౌల్డ్ చేసింది. బెత్‌మూనీ చివరి వరకు క్రీజులో ఉండి ఆసీస్ స్కోరును 184 పరుగులకు చేర్చింది.
భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు, పూనమ్, రాధా తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.