ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఏడు వికెట్లు కోల్పోయింది. వరుస ఓవర్లలో పంత్, పుజారా ఔటయ్యారు. తొలుత హెజిల్‌వుడ్ వేసిన 88వ ఓవర్‌లో పుజారా(50; 176 బంతుల్లో 5x4) అర్ధశతకం సాధించగా అదే ఓవర్‌లో రిషభ్ పంత్(36; 67 బంతుల్లో 4x4) స్లిప్‌లో వార్నర్ చేతికి చిక్కాడు. వీరిద్దరూ 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాసేపటికే అశ్విన్ (10) రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (1), సైనీ (0) ఉన్నారు.
అంతకుముందు 96/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రహానె(22), పుజారా మూడో రోజు ఆటను ప్రారంభించారు. వారిద్దరూ 21 పరుగులు జోడించాక రహానె మూడో వికెట్‌గా వెనుతిరిగాడు. కమిన్స్ వేసిన 55వ ఓవర్‌లో బౌల్డయ్యాడు. ఆపై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ విహారి(4) విఫలమయ్యాడు. 68వ ఓవర్‌లో అనవసరపు పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. దీంతో భారత్ 142 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆపై పుజారా, పంత్ ఐదో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.