మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో టీమ్ఇండియా ఖ్యాతిని ఒక వెలుగు వెలిగించిన క్రికెటర్. భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన మహీ.. మ్యాచ్‌పై ఆశలు వదులుకున్న చాలా సందర్భాల్లో ఆదుకుని జట్టును గెలుపు వైపు నడిపించాడు. మైదానంలో నిశ్శబ్దంగా ఉంటూనే.. కనుసైగలతో మ్యాచ్‌ను నడిపించగల సత్తా ఉన్న వ్యక్తి. ఏ దేశ ఆటగాడితోనైనా ఇట్టే కలిసిపోయి, సన్నిహితుడిలా మెలుగుతాడు. అందుకే, ధోనీ బ్యాటింగ్ స్టైల్ తోపాటు, అతని వ్యక్తిత్వానికి వీరాభిమానులు ఉన్నారు. అయితే, యాదృచ్ఛికమో.. మరింకేదో కానీ, ధోనీ కెరీర్లో నంబర్ ప్రధాన పాత్ర పోషించింది. అతని తొలి గెలుపు దగ్గర నుంచి.. 2011 ప్రపంచ కప్ కైవసం వరకు అంకె కీలకంగా నిలిచింది. అసలు ఈ సంఖ్య ప్రాధాన్యమేంటో ఓ లుక్కేద్దాం రండి.
ధోనీ క్రికెట్ ప్రారంభం..
ధోనీ గురించి మొదట తెలుసుకోవాలంటే మనం 15 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి. 2005లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో.. మహీ తొలి సెంచరీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్ఇండియా తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగిన ధోనీ.. 123 బంతుల్లో 148 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఎంతో సునాయాసంగా గెలిచింది. అప్పటి నుంచి ధోనీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఆ నంబర్ కీలకం..
ధోనీ జీవితంలో నంబర్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అతనితో పాటు, ఆయన అభిమానుల నమ్మకం. ఇక మహీ లక్కీ నంబరు గురించి చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది నంబర్.7. మహేందర్ సింగ్ మైదానంలో 7వ నంబర్ జెర్సీ ధరిస్తాడు. కారు నంబర్ ప్లేట్‌లోనూ 7వ అంకె ఉండాల్సిందే. అయితే, గంగూలీ 3వ స్థానం కూడా ధోనీకి ఎంతో ప్రత్యేకమైనది. ఈ నంబరే మహీని హీరోగా మార్చేసింది.
ధోనీ తన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 0,12,7,3 పరుగులే సాధించాడు. ఆ తర్వాత అప్పటి కెప్టెన్ గంగూలీ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీని మూడో స్థానంలో పంపాడు. అంతే, వచ్చే ఒక్కో బంతిని ధోనీ బౌండరీలు దాటిస్తుంటే.. అందరూ చూస్తుండిపోయారు. ఈ మ్యాచ్‌లోనే కెరీర్లో ధోనీ తొలి సెంచరీ సాధించాడు. అనంతరం దాదా వెళ్లిపోయాక అతడు కొంతకాలం మూడోస్థానంలో కొనసాగాడు.
అత్యధిక పరుగులు
శ్రీలంకతో 2005లో జరిగిన వన్డే సిరీస్.. ధోనీ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఓ మ్యాచ్‌లో మహీ ఆకలితో ఉన్న పులిలా విరుచుకుపడి.. బౌలర్లకు చెమటలు పట్టించాడు. అలా తన వన్డే కెరీర్లో అత్యధికంగా 183 పరుగులు సాధించాడు.
యాదృచ్ఛికమో.. ఇంకేదో కానీ, గంగూలీ మూడో స్థానంలో కొనసాగినప్పటి నుంచి దూసుకుపోయాడు ధోనీ. ఆశ్చర్యం ఏమిటంటే దాదా కెరీర్లో అత్యధిక పరుగులు కూడా 183. ఆ తర్వాత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు మహీ. ఇక ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన వన్డే కెరీర్లో చేసిన అత్యధిక పరుగులు 183. ఇలా భారత జట్టుకు గొప్ప కెప్టెన్లుగా పేరుగాంచిన ఈ ముగ్గురికి మూడో నంబర్ ఎంతో కలిసొచ్చింది.
జట్టు సారథిగా..
2007 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఓటమి తర్వాత.. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీని వదులుకున్నాడు. అనంతరం ధోనీ జట్టు సారథిగా వ్యవహరించాడు. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే నిర్వహించిన.. తొలి టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ను విజయం వైపు నడిపించాడు. ఆ సమయంలోనే అతనిలోని అసలైన నాయకుడు బయటపడ్డాడు.
వరల్డ్ కప్‌కు కీలకమైన మూడో స్థానం..
భారత క్రికెట్ చరిత్రలో 1983 ప్రపంచకప్ తర్వాత మైలురాయిగా నిలిచిన టోర్నీ 2011వరల్డ్‌కప్. ఈ టోర్నీలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. 274 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్... మొదట్లోనే సెహ్వాగ్, సచిన్ వంటి దిగ్గజ ఆటగాళ్లను కోల్పోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో గౌతమ్ గంభీర్‌ను రంగంలోకి దింపాడు మహీ. గంభీర్ సూపర్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలుపు దిశగా నడిపించాడు. ఆ తర్వాత ఐదో స్థానంలో మైదానంలోకి అడుగుపెట్టిన ధోనీ చివరివరకు నిలబడి.. వచ్చిన బంతిని విడిచిపెట్టకుండా బౌండరీలను దాటించి 91 పరుగులతో నాకౌట్‌గా నిలిచాడు. ఆ సమయంలో ఆటగాళ్ల స్థానాల్ని మార్చడంపై ధోనీ తీసుకున్న నిర్ణయమే.. 28 ఏళ్ల తర్వాత భారత్‌ను ప్రపంచ విజేతగా నిలిపింది.
మూడో స్థానానికి దూరం.. ట్రోఫీ వైఫల్యం
2014లో టెస్టులకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం.. కోహ్లీ జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. 2019 ప్రపంచకప్‌లో మూడో స్థానంలో ఆడే అవసరం వచ్చినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆ నంబర్లో కొనసాగలేదు. ఈ టోర్నీలో మహీ ఏడో స్థానంలో బరిలో దిగాడు. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీమ్ఇండియా అభిమానులకు ఈ మెగాటోర్నీ నిరాశనే మిగిల్చింది.