భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సలహా ఇచ్చాడు. అతడు స్థిరమైన బ్యాట్స్‌మన్ అని అనిపించుకోవాలంటే సులువుగా వికెట్ చేజార్చుకోవడం మానుకోవాలని సూచించాడు. అది కూడా మంచి ప్రారంభం లభించినప్పుడు.. ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు.
ఆసీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ ఔట్ అయిన విధానం పట్ల ఇప్పటికే పలువురు క్రికెట్ మాజీలు విమర్శలు చేశారు. అయితే అది తన సహజశైలి అని రోహిత్ తనను తాను సమర్థించుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించాడు పాంటింగ్.
"అతడు అలానే ఆడతా అని చెప్పడం చాలా సులువు కానీ అంతకన్నా మెరుగ్గా ఆడాలి. నిలకడైన మంచి బ్యాట్స్‌మన్ అనింపించుకోవాలంటే ఇష్టం వచ్చినట్లు ఆడకూడదు. ఇలానే గొప్ప ఇన్నింగ్స్ చేజార్చుకోవాల్సి వస్తుంది. రోహిత్.. 44 పరుగులు చాలా సులువుగా చేశాడు. మంచి షాట్లు కూడా ఆడాడు. కానీ అప్పుడే ఆసీస్ అతడి చుట్టూ ఉచ్చు బిగించింది. ఆ సమయంలో అతడు ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ ప్రత్యర్థుల వలలో చిక్కుకున్నాడు. నాకు తెలిసి అతడు తన సమయం కోసం మరోసారి ఎదురుచూస్తాడు."
-రిక్కీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ సారథి
ఆసీస్‌తో గబ్బాలో జరుగుతన్న నిర్ణయాత్మక చివరి టెస్టులో ఓపెనర్‌గా వచ్చాడు రోహిత్. లైయన్ వేసిన ఓవర్లోని ఐదో బంతిని అతడు గాల్లోకి షాట్ కొట్టాడు. అది కాస్త స్టార్క్ చేతికి చిక్కింది. దీంతో భారత్ 60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ఇదీ చూడండి: ఆ షాట్ ఆడినందుకు బాధ లేదు: రోహిత్