క్రికెట్లో 50 పరుగులు చేస్తే అర్ధశతకం అంటారు. 100 పరుగులు చేస్తే శతకం అంటారు. 200 పరుగులు సాధిస్తే ద్విశతకం అంటారు. అప్పుడప్పుడు డబుల్ సెంచరీని వ్యాఖ్యాతలు, విశ్లేషకులు 'డాడీ హండ్రెడ్' అని చమత్కరిస్తుంటారు. మరి 150, 250, 300 పరుగులు చేస్తే ఏమంటారనే సందేహం మీకు వచ్చే ఉంటుంది కదా! ఓ అభిమాని ఇదే ప్రశ్న అడగ్గా టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ విచిత్రమైన జవాబు ఇచ్చాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. భారత్, ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడుతున్నాయి. మ్యాచులో రెండోరోజు 'ఛానెల్ 7'లో సన్నీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ట్విటర్లో #AskSunny పేరుతో ఆ సంస్థ ప్రశ్న జవాబుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సన్నీ చిలిపిగా సమాధానాలు ఇచ్చారు.
100+, 150+, 200+, 250+, 300+ పరుగులు చేస్తే ఏమంటారని ఒకరు అడగ్గా "100+ అయితే బేబీ హండ్రెడ్, 150+ అయితే టీనేజ్ హండ్రెడ్, 200+ అయితే డాడీ హండ్రెడ్, 250+ అయితే ఫాదర్ ఇన్‌లా (మామ) హండ్రెడ్, 300+ అయితే గ్రాండ్‌డాడీ (తాత) హండ్రెడ్" అని సన్నీ సమాధానమివ్వడం గమనార్హం. మీ అన్ని ఇన్నింగ్సుల్లో ఇష్టమైన ఇన్నింగ్స్ ఏదంటే.. "1971లో మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌పై చేసిన 57 పరుగుల ఇన్నింగ్స్ నాకిష్టం. అత్యంత చలి, గాలి, పచ్చిక ఉన్న పిచ్‌పై ఆడాం" అని చెప్పారు.
మాజీ క్రికెటర్ జయసింహ తనకు ఇష్టమైన, ఆదర్శంగా భావించే క్రికెటరని మరో ప్రశ్నకు చెప్పారు. ఆయన బ్యాటింగ్‌ను ఎంతో ప్రేమిస్తానని, మైదానం ఆయన నడవడిక మరింత నచ్చుతుందని వెల్లడించారు. బాబార్ అజామ్ గురించి అడగ్గా "అతడో విధ్వంసకర ఆటగాడు. టాప్-5 క్రికెటర్లలో కోహ్లీ, విలియమ్సన్, స్మిత్, వార్నర్‌తో పాటు అతడినీ ఎంచుకుంటా" అని సన్నీ తెలిపారు.