ఒకప్పుడు వారికి మ్యాచ్ ఫీజుల్లేవు.. కాంట్రాక్టుల్లేవు. ఆడుతుంటే లైవ్ ప్రసారాలు లేవు.. జనాలకు అసలు పట్టింపే లేదు! కానీ ఇప్పుడు.. ఫీజులకు లోటు లేదు. వార్షిక వేతనాలొస్తున్నాయి. అన్ని మ్యాచ్‌లకూ లైవ్ ఇస్తున్నారు. జనాలూ వాళ్ల ఆటను బాగానే ఆస్వాదిస్తున్నారు. రెండు దశాబ్దాల వ్యవధిలో భారత మహిళల క్రికెట్లో వచ్చిన గొప్ప మార్పు ఇది. అయినా సరే.. పురుషుల క్రికెట్‌తో అంతరం ఎంతో. దానిని తగ్గించి, తమ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లే బృహత్తర అవకాశం అమ్మాయిల ముందు నిలిచింది. వారి కోసమే ఎదురు చూస్తోంది మహిళా టీ20 ప్రపంచకప్ ట్రోఫీ. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమకు తాము ఇచ్చుకోగల గొప్ప కానుక.. దేశానికి అందించగల అరుదైన కానుక. అందుకే హర్మన్ సేన.. తొలి ప్రపంచకప్ అందుకోవాలని, పలువురు యువత.. ఈటీవీ భారత్ ద్వారా 'ఆల్ ద బెస్ట్' చెప్పారు.
ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ఈ ఫైనల్ జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది ఆరో ఫైనల్. మహిళా టీమిండియాకు మొదటిది. వన్డే ప్రపంచకప్‌లో మాత్రం మన మహిళలకు రెండుసార్లు ఫైనల్ ఆడిన అనుభవముంది. ఆసీస్‌తో భారత్ ఆడిన టీ20ల్లో 6 మ్యాచ్‌ల్లో నెగ్గి, 13 ఓడింది. ఆ జట్టుతో ఆడిన తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన భారత్.. తర్వాతి 12 మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గింది.