ప్రాణాంతక కరోనా దెబ్బకు వివిధ దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. మన దగ్గర అయితే ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐసీసీ సన్నద్ధమైంది. చరిత్రలో నిలిచిపోయిన క్రికెట్ మ్యాచ్‌లు, మధుర ఘట్టాలు, అద్భుత క్షణాలను తిరిగి ప్రసారం చేయనుంది. తమ ప్రసార భాగస్వామ్య ఛానళ్ల ద్వారా ప్రేక్షకులను తిరిగి పాత రోజుల్లోకి తీసుకెళ్లనుంది.
1975 తర్వాతి నుంచి
ఎప్పటికీ మరిచిపోలేని క్రికెట్ మ్యాచ్‌లు, హైలైట్లు చూసే అవకాశం అభిమానులకు మరోసారి దక్కనుంది. 1975 నుంచి మొదలు పురుషుల, మహిళల టీ20, వన్డే ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు, అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. ఐసీసీకి చెందిన సామాజిక మాధ్యమ ఖాతాల్లో.. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లోనూ ఈ వీడియోలను పెట్టనున్నారు. తమకు నచ్చిన మ్యాచ్‌లను తిరిగి చూడాలనుకునే అభిమానులు వాటి ప్రసారం కోసం ఐసీసీని కోరవచ్చు.
"క్రీడారంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో అభిమానులతో కలిసి సాగాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఒక్కటి చేసేందుకు మైదానాల్లో మ్యాచ్‌లు జరగట్లేదు. కాబట్టి ఇదివరకే జరిగిన మ్యాచ్‌ల తాలుకూ అద్భుతమైన క్షణాలను తిరిగి ప్రేక్షకులకు అందించాలనుకున్నాం. వైరస్ వల్ల ఆటలు లేకపోవడంతో డీలా పడ్డ మా ప్రసార భాగస్వాములకు, అదే విధంగా ఇళ్లలో ఉంటున్న అభిమానులకు దీనివల్ల ప్రయోజనం చేకూరే అవకాశముంది"
- మను సాహ్‌నీ, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
ఇదీ చదవండి: 'అలా అయితే ధోని ఆడటం సందేహమే!'