కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. అయితే దీంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కూడా అయోమయంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్యూటీసీ షెడ్యూల్‌పై సమీక్ష చేయనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. కరోనా వల్ల వాయిదా లేదా రద్దయిన టెస్టుల కారణంగా డబ్ల్యూటీసీని రీషెడ్యూల్ చేయాలని పలు దేశాలు అభిప్రాయపడం వల్ల ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
"కరోనా వల్ల ఇప్పటికే అనుకున్న షెడ్యూల్ ప్రకారం దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు రద్దయ్యాయి. దీనివల్ల డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఈ జట్లు వెనుకపడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో జరగబోయే సిరీస్‌లు కూడా సందిగ్ధంలో పడ్డాయి. దాదాపు ఇవి జరగడం కూడా అసాధ్యమే. కాబట్టి టెస్టుఛాంపియన్షిప్ రీషెడ్యూల్‌పై ఐసీసీ సమీక్ష జరుపుతోంది. కానీ దీనిపై ఓ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం షెడ్యూల్ తేదీని పొడిగించాలా? లేదా పాయింట్ల పట్టికలో ఏవైనా మార్పులు చేయాలా? వంటి అంశాలను పరిశీలిస్తున్నాం. అక్టోబర్ నాటికి తుది నిర్ణయాన్ని ప్రకటించాలని మా కమిటీ భావిస్తోంది. ఏదేమైనప్పటికీ టెస్టుఛాంపియన్షిప్ను త్వరగా ముగిస్తాం."
-ఐసీసీ అధికారి.
టీ20 ప్రపంచకప్ నిర్వహణ తేదీపైనా ఓ నిర్ణయాన్ని ప్రకటించేందుకు చూస్తున్నామని తెలిపింది ఐసీసీ. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
ప్రస్తుతం డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో 360 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో ఉండగా... ఆస్ట్రేలియా(296), ఇంగ్లాండ్(146) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇది చూడండి : టెస్టు ఛాంపియన్‌షిప్‌ను పొడిగించాలి: బీసీబీ