టెస్టుల స్వరూపాన్ని మార్చే దిశగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే డే/నైట్ టెస్టుల్ని ప్రవేశపెట్టి ఆటగాళ్లు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. గులాబి బంతి పట్ల సానుకూల స్పందనే వచ్చిన నేపథ్యంలో.. సంప్రదాయ ఫార్మాట్లో మరో కీలక మార్పు దిశగా ఐసీసీ కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం.
అయిదు రోజుల టెస్టుల్ని నాలుగు రోజులకు కుదించాలని మండలి తీర్మానానికి వచ్చింది! 2023లో ముగియనున్న ప్రస్తుత భవిష్యత్ పర్యటనల ప్రణాళిక (ఎఫ్‌టీపీ) అనంతరం.. నాలుగు రోజుల మ్యాచ్‌లు అమల్లోకి వచ్చే అవకాశముంది. 2023-31 మధ్య ఎనిమిదేళ్లలో పూర్తిగా టెస్టులు నాలుగు రోజుల వ్యవధిలోనే జరగనున్నట్లు తెలుస్తోంది.
టీ20ల రాజ్యం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అయిదు రోజుల పాటు టెస్టు మ్యాచ్ ఆడటం పట్ల ఈ తరం ఆటగాళ్లు అంత సానుకూలంగా లేరన్న అభిప్రాయాలున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌లు మరిన్ని నిర్వహించి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న బీసీసీఐ లాంటి బోర్డులు కూడా టెస్టుల్ని నాలుగు రోజులకు కుదించడం పట్ల సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ సభ్య దేశాలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్న కారణంగా వచ్చే ఎఫ్‌టీపీలో పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే నిర్వహించాలని ఐసీసీ తీర్మానించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 2017లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య తొలి నాలుగు రోజుల టెస్టు నిర్వహించగా.. ఈ ఏడాది ఐర్లాండ్‌తో ఇంగ్లాండ్ కూడా ఓ మ్యాచ్ ఆడింది.
ఇవీ చూడండి.. రివ్యూ 2019: భవిష్యత్తుపై భరోసా ఇస్తోన్న యువకెరటాలు