ఏడాది నిషేధం తర్వాత యాషెస్ సిరీస్ ఆడిన స్టీవ్ స్మిత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మెరిశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్మిత్‌కి, కోహ్లీకి మధ్య కేవలం 9 పాయింట్ల అంతరమే ఉంది.
922 పాయింట్లతో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా.. 913 పాయింట్లో ద్వితీయ స్థానంలో ఉన్నాడు స్టీవ్ స్మిత్. భారత ఆటగాడు చెతేశ్వర్ పుజారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే నాలుగు ర్యాంకులు మెరుగుపరచుకొని 8వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఫామ్‌లేమితో తొమ్మిదో ర్యాంకుకు దిగజారాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్.
బౌలర్ల విభాగంలో ఆసీస్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఆటగాడు రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపరుచుకొని ఐదుకు చేరుకున్నాడు. అశ్విన్ 10వ స్థానంలో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ల విభాగంలో జడ్డూ 3వ స్థానంలో.. విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
జట్ల వారీగా టీమిండియా(113 పాయింట్లు) మొదటి ర్యాంకులో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (111 పాయింట్లు) రెండో స్థానంలో.. దక్షిణాఫ్రికా(108 పాయింట్లు) మూడో ర్యాంకులో నిలిచాయి.
ఇది చదవండి: టీమిండియా సహాయక సిబ్బంది ఎవరంటే..!