ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో విఫలమైన విరాట్... తాజాగా అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం భారత స్టార్ క్రికెటర్ 906 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ 911 పాయింట్లతో టాపర్‌గా నిలిచాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్...
కివీస్ సారథి కేన్ విలియమ్సన్ ఒక ర్యాంక్ మెరుగుపర్చుకుని 853 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. భారత క్రికెటర్లలో రహానె ఒక స్థానం మెరుగుపడి 8వ ర్యాంక్‌లోనూ, అగర్వాల్ 2 స్థానాలు దూసుకెళ్లి టాప్-10లోనూ నిలిచాడు. పుజారా 2 స్థానాలు దిగజారి 9వ స్థానంలో నిలిచాడు.
ముగ్గురిలో ఒకడే మిగిలాడు...
గత టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 6వ స్థానంలో, బౌలర్ రవిచంద్ర అశ్విన్ 8లో, షమి 9వ ర్యాంక్‌లో ఉండేవారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ప్రదర్శన తర్వాత షమి, బుమ్రా స్థానాలు గల్లంతయ్యాయి. టాప్-10లో వీరిద్దరూ చోటు కోల్పోయారు. అశ్విన్ మాత్రమే ఒక ర్యాంక్ కోల్పోయి 9వ స్థానంలో నిలిచాడు.
మనమే టాప్...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా టాప్‌లో కొనసాగుతోంది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఎదుర్కొన్నా.. 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా(296), ఇంగ్లాండ్(146) వరుసగా ఉన్నాయి. పాకిస్థాన్(140), న్యూజిలాండ్(120), శ్రీలంక 80 పాయింట్లతో నాలుగు, ఐదు, ఆరు ర్యాంక్‌ల్లో ఉండగా... దక్షిణాఫ్రికా (24), బంగ్లాదేశ్(0), వెస్టిండీస్(0) వరుసగా జాబితాలో నిలిచాయి.