వన్డే క్రికెట్ పండుగకు సర్వం సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఎవరు గెలుస్తారు, రికార్డులు సృష్టిస్తారా, ఏ బౌలర్ ఆకట్టుకుంటాడు.... ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అభిమానుల మదిని తొలిచేస్తున్నాయి. ఇటీవలే జరిగిన ఐపీఎల్లో ఆకట్టుకున్న క్రికెటర్స్... ప్రపంచకప్‌లో ఎలాంటి సంచలన ప్రదర్శనలు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈ జాబితాలో వార్నర్, రబాడా, తాహిర్, ధోని, రసెల్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్లు.
డేవిడ్ వార్నర్- ఆస్ట్రేలియా
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. అనంతరం ఐపీఎల్లో ఎలా ఆడతాడా అన్న అభిమానుల ఆలోచనలకు తెర దించుతూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. హైదరాబాద్ జట్టు టాప్-4 నిలిచేందుకు ఈ క్రికెటర్ ఓ కారణమే.
మొత్తం 12 మ్యాచ్‌లాడిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్.. 144 స్ట్రయిక్ రేటుతో 692 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇదే ఊపు కొనసాగించి ప్రపంచకప్‌లోనూ అత్యధిక పరుగులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కగిసో రబాడా-దక్షిణాఫ్రికా
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏటా యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తుంటారు. ఈ సంవత్సరం అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు దక్షిణాఫ్రికా బౌలర్ రబాడా. దిల్లీ క్యాపిటల్స్ తరఫున 12 మ్యాచ్‌లాడి 25 వికెట్లు తీశాడు. ఆ జట్టు ఆరేళ్ల తర్వాత క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రపంచకప్ ఇంగ్లాండ్‌లో జరగనుంది. అక్కడి పిచ్‌లు పేసర్లకు అనుకూలించే అవకాశం ఎక్కువ. అలాంటి చోట రబాడా ఎలా చెలరేగుతాడో చూడాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇమ్రాన్ తాహిర్-దక్షిణాఫ్రికా
నాలుగు పదుల వయసులోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు ఇమ్రాన్ తాహిర్. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ బౌలర్ ఐపీఎల్లో చెన్నైకు ప్రాతినిధ్యం వహించాడు. 17 మ్యాచ్‌లాడి 26 వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.
ఇంగ్లాండ్‌లో జరిగే ఈ ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోనున్నాడీ స్పిన్ బౌలర్. కప్పు దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికాను విజేతగా నిలబెట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని- భారత్
మహేంద్ర సింగ్ ధోని.. పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్-12లో చెన్నై తరఫున కొన్ని అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గానూ అలరించాడు. 12 మ్యాచ్‌ల్లో 83.20 సగటుతో 416 రన్స్ చేసి ఆ జట్టులో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ప్రస్తుత టీమిండియాలో సభ్యుడైన ధోని.. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కీపర్‌గానూ వ్యూహాలు రచించేందుకు సిద్ధమవుతున్నాడు. కెప్టెన్‌గా తొలి ప్రపంచకప్ ఆడుతున్న కోహ్లీకి పూర్తి సహకారం అందించనున్నాడు.
ఆండ్రీ రసెల్- వెస్టిండీస్
ప్రస్తుత ప్రపంచకప్ జట్లను పరిశీలిస్తే వెస్టిండీస్‌కు మిగతా వాటికి ఓ తేడా కనిపిస్తుంది. అన్ని టీమ్‌లలోనూ ఒకరో ఇద్దరు హిట్టర్లు ఉంటారు. ఈ కరీబియన్ జట్టులో మాత్రం అందరూ విధ్వంసకారులే. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గేల్, రసెల్ గురించి. ఐపీఎల్-12లో ఆడిన రసెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాటుతోనే కాకుండా బౌలర్‌గానూ రాణించాడు.
ఐపీఎల్లో 14 మ్యాచ్‌లాడి 204.81 సగటుతో 510 పరుగులు చేశాడు. సీజన్ మొత్తంలో అత్యధికంగా 52 సిక్స్‌లు కొట్టాడు. బౌలర్‌గా 11 వికెట్లు తీశాడు. ఇదే విధంగా రాణిస్తే ప్రపంచకప్‌లోనూ ఈ క్రికెటర్ నుంచి అద్భుతాలు చూడొచ్చు.